మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి మృతి

మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి మృతి

నల్గొండ అర్బన్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి(65) చనిపోయారు. మంగళవారం ఉదయం నల్గొండ రామగిరిలో ఉన్న ఆమె నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రుద్రమదేవి 20 ఏళ్లకే నల్గొండ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. 1981లో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి నల్గొండకు వచ్చిన సందర్భంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. 1985లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్టీ రామారావు రాజీనామా అనంతరం ఆ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

23 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. టీడీపీలో చాలాకాలం పనిచేసిన ఆమె అనంతరం కాంగ్రెస్​లో చేరారు. ఆమె భర్త రంగారెడ్డి డీసీసీ అధ్యక్షునిగా, బార్​అసోసియేషన్​అధ్యక్షుడిగా పని చేశారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆమె  కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు.  మంత్రి జగదీశ్​రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కాంగ్రెస్​ పట్టణాధ్యక్షులు గుమ్ముల మోహన్​రెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు రుద్రమదేవికి నివాళులర్పించారు.