కరోనా ఎఫెక్ట్: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే ఇవి ఉండాల్సిందే

కరోనా ఎఫెక్ట్: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే ఇవి ఉండాల్సిందే

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్ వల్ల ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) నుంచి మూడు నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ మెజారిటీ ఉద్యోగులు ఈ సదుపాయాన్ని పొందలేకపోతున్నారు. ప్రతి వంద అకౌంట్లలో కనీసం35 శాతం మాత్రమే నో యువర్ కస్టమర్ (కేవైసీ) రూల్స్ ప్రకారం ఉన్నాయి. కేవైసీ కంప్లయన్స్ లేని చందాదారులు డబ్బు పొందాలంటే కాస్త కష్టమే! వాళ్లు పనిచేసే కంపెనీ/సంస్థ సహకరిస్తే మాత్రం పని అవుతుంది. ఈపీఎఫ్ అకౌంట్ నిర్వహణ కోసం ప్రతి చందాదారుడికి కేటాయించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్లలో (యూఏఎన్) 44.75 శాతం మాత్రమే బ్యాంకు, ఆధార్ నంబర్లకు సీడ్ అయ్యాయి. వీటిని ఉద్యోగుల యాజమాన్యాలు డిజిటల్ సిగ్నీచర్ ద్వారా ధ్రువీకరించాయి కూడా. దీనివల్ల ఇక నుంచి పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం సులువు అవుతుంది. యాజమాన్యం అనుమతి కూడా అవసరం ఉండదు. ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు 17.03 కోట్ల యూఏఎన్ నెంబర్లను ఇచ్చింది. వీటిలో కొన్ని యాక్టివ్ గా, కొన్ని ఇనాక్టివ్ గా ఉన్నాయి.

మూడు రోజుల్లోనే ఇచ్చే చాన్స్

తాజా రూల్స్ ప్రకారం తమ చందాదారులు మూడు నెలల బేసిక్ జీతం లేదా డీఏలో 75 శాతం.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే, దానిని తీసుకోవడానికి అర్హులు. కరోనా ఎఫెక్ట్ వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు పీఎఫ్ ను విత్ డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈపీఎఫ్ఓ తన సెంట్రలైజ్డ్ సర్వర్ ద్వారా ఆటో సెటిల్మెంట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవైసీ పూర్తిస్థాయిలో అప్డేట్ అయి ఉన్న వాళ్లు విత్డ్రాయల్ కు దరఖాస్తు చేసుకుంటే కేవలం మూడు రోజుల్లోనే డబ్బు వస్తుంది. మొత్తం యూఏఎన్ ఖాతాల్లో 43.73 శాతం మాత్రమే కేవైసీ ప్రకారం ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 12 ఈపీఎఫ్ఓ రీజనల్ ఆఫీసుల్లోని 33 శాతం ఖాతాలు మాత్రమే రూల్స్ ప్రకారం ఉన్నాయి. కశ్మీర్ రీజనల్ ఆఫీసులో కేవలం 0.19 ఖాతాలు, గువాహటి రీజనల్ ఆఫీసులో 11 శాతం ఖాతాలు మాత్రమే రూల్స్ ప్రకారం ఉన్నాయి.

‘‘కేవైసీ లేని వాళ్లు కూడా తమ సంస్థ సహకారం ద్వారా డబ్బు తీసుకోవచ్చు. అయితే చిన్న ఫ్యాక్టరీలు, భవన నిర్మాణరంగం, ఎంఎస్ఎంఈల్లో పనిచేసే వారికే డబ్బు ఎక్కువ అవసరం. ఇప్పుడు అవన్నీ మూతపడి ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగులు ఇప్పటికిప్పుడు దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు”అని ఒక ఆఫీసర్ వివరించారు. మరొక విషయం ఏమిటంటే ఎకానమీ నెమ్మదించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ చందాదారులకు, వాటి యాజమాన్యాలకు డబ్బు చెల్లించడం ప్రభుత్వానికీ ఇబ్బందే. అయితే 101 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉండి, వారిలో 90 శాతం మంది జీతం రూ.15 వేల కంటే తక్కువ ఉంటేనే ఈ సదుపాయం పొందవచ్చు. ఈ రూల్ ఉద్యోగులపై వివక్ష చూపేలా ఉందని, విత్ డ్రాయల్ సదుపాయం అందరికీ వర్తించేలా చేయాలని ట్రేడ్యూనియన్లు అంటున్నాయి.

For More News..

కరోనా వయా మలేషియా టూ ఢిల్లీ, తెలంగాణ

కరోనా దెబ్బకు ఎంసెట్ కూడా వాయిదా?

కరోనా చావులతో రికార్డుకెక్కిన అమెరికా.. ఒక్కరోజులోనే..