డాలర్ మారకంలో ఈ ఏడాది 9 % డౌన్

డాలర్ మారకంలో ఈ ఏడాది 9 % డౌన్

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: డాలర్ వాల్యూ రికార్డ్‌‌ లెవెల్‌‌కు చేరుకోవడంతో  దేశ కరెన్సీ రూపాయి వాల్యూ  కొత్త కనిష్టాలకు పడిపోతోంది. లోకల్ మార్కెట్‌‌లు నష్టాల్లో ట్రేడయిన వేళ బుధవారం  సెషన్‌‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ మరో 40 పైసలు తగ్గి 81.93 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 82.02 వద్ద కొత్త ఆల్‌‌టైమ్‌‌ కనిష్టాన్ని నమోదు చేసింది.  ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత నుంచి యూఎస్ బాండ్‌‌ ఈల్డ్‌‌ (రాబడి), డాలర్‌‌‌‌ ఇండెక్స్‌‌లు రికార్డ్ లెవెల్‌‌కు చేరుకున్నాయి. మరోవైపు గ్లోబల్ ఎకానమీ రెసిషన్‌‌లోకి జారుకుంటుందనే భయాలు ఎక్కువవుతున్నాయి. దీంతో  రూపాయిలోకి వచ్చిన విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌లు సేఫ్ అసెట్ అయిన డాలర్‌‌‌‌లోకి వెళుతున్నాయి. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో 73 లెవెల్‌‌ దగ్గర ట్రేడయిన రూపాయి,  ప్రస్తుతం 82 కి చేరువలో కదులుతోంది.  ఏడాది కాలంలోనే రూపాయి విలువ 9 శాతం పడిపోయింది. కాగా, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌‌ బుధవారం 4 శాతానికి చేరుకుంది. 2010 తర్వాత ఇదే హయ్యస్ట్ లెవెల్.  మరోవైపు డాలర్ ఇండెక్స్ కొన్నేళ్ల గరిష్టమైన 114.78 కి చేరుకుంది. ‘ఇన్‌‌ఫ్లేషన్‌‌ను తగ్గించేందుకు ఏమైనా చేస్తాం’ అనే ఫెడ్ ధోరణి, ఎనర్జీ క్రైసిస్‌‌తో అధ్వాన్నంగా మారిన యూరప్ ఎకానమీ యూఎస్ డాలర్‌‌‌‌ను సేఫ్ అసెట్‌‌గా మార్చాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ ఎకానమిస్ట్‌‌ ఉపాసనా భరద్వాజ్‌‌ అన్నారు. తాజాగా యూకే ప్రభుత్వం ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజితో డాలర్ మారకంలో బ్రిటిష్ పౌండ్  కొన్నేళ్ల కనిష్టానికి తగ్గిందని, ఈ ప్రభావం ఇతర కరెన్సీలపై కూడా పడుతోందని వివరించారు. ఆర్‌‌‌‌బీఐ జోక్యంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ 79–83 మధ్య ట్రేడవ్వొచ్చని అంచనావేశారు. 

ఇంకా తగ్గనున్న ఫారెక్స్ నిల్వలు..

ఇప్పటికే రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన దేశ ఫారెక్స్ నిల్వలు మరింతగా తగ్గుతాయని రాయిటర్స్ పోల్ అంచనావేసింది. గత కొన్ని నెలల నుంచి పడుతున్న రూపాయికి సపోర్ట్ ఇచ్చేందుకు డాలర్లను ఆర్‌‌‌‌బీఐ అమ్ముతున్న విషయం తెలిసిందే. దీంతో  ఏడాది క్రితం 642 బిలియన్ డాలర్ల వద్ద ఆల్‌‌ టైమ్ గరిష్టాన్ని తాకిన ఫారెక్స్ నిల్వలు ప్రస్తుతం 545 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఈ ఏడాది ముగిసే నాటికి మరో 23 బిలియన్ డాలర్లు తగ్గుతాయని రాయిటర్స్ పోల్ వివరించింది. ఇంత వేగంగా దేశ ఫారెక్స్ నిల్వలు తగ్గడాన్ని 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత చూడలేదు. ఆ టైమ్‌‌లో ఫారెక్స్ నిల్వలు 20 % పడ్డాయి. మరోవైపు రెండు నెలలకు ఒకసారి జరిగే ఎంపీసీ  మీటింగ్ బుధవారం మొదలయ్యింది. ఈసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.

బేర్స్ పంజా..

మార్కెట్‌‌లో బేర్స్ హవా కొనసాగుతోంది. గ్లోబల్‌‌ మార్కెట్‌‌లు పడుతుండడంతో లోకల్ మార్కెట్‌‌లు కూడా  వరసగా ఆరో సెషన్‌‌లోనూ నష్టపోయాయి.  సెన్సెక్స్ బుధవారం 509 పాయింట్లు తగ్గి 56,598 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 149 పాయింట్లు (0.87 %) నష్టపోయి 16,858 వద్ద ముగిసింది. ఎఫ్‌‌ఐఐలు  ఎమర్జింగ్ మార్కెట్‌‌ల నుంచి వెళ్లిపోతుండడంతో పాటు లోకల్ మార్కెట్‌‌లు ఎక్కువ వాల్యుయేషన్‌‌లో ట్రేడవుతుండడంతో కొనుగోలు జరపడానికి ఇన్వెస్టర్లు వెనకడగేస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. గ్లోబల్‌‌ ఎకానమీ మాంద్యంలోకి జారుకుంటుండడంతో మన ఎకానమీ బాగున్నా  రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం లేదని వివరించారు.