Rupee Vs Dollar: పతనంలో రూపాయి సరికొత్త రికార్డ్.. డాలర్ @ రూ.95.80

Rupee Vs Dollar: పతనంలో రూపాయి సరికొత్త రికార్డ్.. డాలర్ @ రూ.95.80

భారత ఆర్థిక వ్యవస్థను ఒకవైపు రూపాయి పతనం.. మరోవైపు ముడి చమురు ధరల మంట కుదిపేస్తున్నాయి. వీటికి తోడు మన స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పరారీ.. వెరసి దలాల్ స్ట్రీట్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా 95.8 గరిష్ట స్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరువలో ఉండటం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలపై భారంగా మారింది.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఆర్థిక కట్టడి చర్యలు ప్రారంభించింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రభుత్వం అనవసర దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా మే 13, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6 శాతం నుండి 15 శాతానికి పెంచుతూ మంగళవారం అర్థరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం.. మే నెలలోని మొదటి 7 ట్రేడింగ్ సెషన్లలోనే ఎఫ్ఐఐలు సుమారు రూ. 21వేల 469 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.35వేల 323 కోట్లను ఇన్ఫ్యూజ్ చేస్తూ మార్కెట్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల వాణిజ్య లోటు పెరిగే అవకాశం ఉందని.. దీనిని అరికట్టేందుకు వినియోగదారులు ఇంధన పొదుపు పాటించాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను మరింత అప్రమత్తం చేశాయి.

యూఏఈ నుంచి కోటా పద్ధతిలో దిగుమతి చేసుకునే బంగారంపై ఉన్న కొన్ని రాయితీలను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.  విదేశీ మారక నిల్వలను కాపాడటం ద్వారా రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగితే.. ఈ ఒత్తిడి రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మార్కెట్లలో ఎఫ్ఐఐల అమ్మకాల హోరు తగ్గినప్పుడే రూపాయి మళ్లీ కోలుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.