భారత ఆర్థిక వ్యవస్థలో బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదుఅదొక సెంటిమెంట్. అలాగే ఇండియన్ ఫ్యామిలీస్ దానిని ఒక బలమైన పెట్టుబడిగా భావిస్తుంటాయి. అయితే ఇటీవల ప్రధాని మోడీ దేశ ప్రజలకు చేసిన ఒక చిన్న విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం ఏడాది పాటు బంగారు ఆభరణాల కొనుగోలుకు దూరంగా ఉండమని ఏకంగా ప్రధాని కోరడం వెనుక పెను ఆర్థిక సంక్షోభం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ కూడా అదే అంటోంది.
ప్రస్తుతం మోడీ మాటలను డీకోడ్ చేసిన జెఫరీస్ తాజా పరిస్థితిని 2012-13 నాటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సంక్షోభంతో పోలుస్తూ నివేదికను విడుదల చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం స్టార్ట్ అయ్యిందా లేక మోడీ సర్కార్ ప్రజలకు తెలియకుండా ఏదైనా దాయాలని చూస్తుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2012-13 పరిస్థితులు రిపీట్:
జెఫరీస్ తన నివేదికలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి కూడా సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితులనే ఎదుర్కొంది. అప్పట్లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా ప్రజలను బంగారం కొనవద్దని కోరారు. అప్పట్లో బంగారం దిగుమతులు భారీగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి.. రూపాయి విలువ పతనమైంది. ఇప్పుడు ప్రధాని మోడీ వ్యాఖ్యలు కూడా సరిగ్గా అదే రీతిలో ఉన్నాయని, ఇది ప్రభుత్వం తీసుకోబోయే కఠిన చర్యలకు సంకేతం కావచ్చని జెఫరీస్ చెప్పింది. దీనికి అనుగుణంగానే దిగుమతి సుంకాల పెంపును మోడీ సర్కార్ తీసుకొచ్చింది.
ఎందుకీ ఆందోళన?
భారత ఆర్థిక వ్యవస్థకు బంగారం ఇప్పుడు ఒక భారంగా మారుతోంది. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత గోల్డ్ దిగుమతులు ఏకంగా 24 శాతం పెరిగి 71.98 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది 2023 నాటి 35 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. క్రూడ్ ఆయిల్ తర్వాత భారత్ అత్యధికంగా ఖర్చు చేస్తున్నది బంగారం దిగుమతుల కోసమే. దేశం చేస్తున్న మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 10 శాతానికి చేరింది. దీనికి తోడు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రూడ్ ధరలను పెంచుతుండటంతో.. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చేసేది లేక బంగారం కొనొద్దని, పెట్రోల్ వాడకం తగ్గించాలని ప్రధాని మోడీ ప్రజలను కోరారు.
రాబోయే రోజుల్లో కఠిన ఆంక్షలు తప్పవా?
2013లో సంక్షోభాన్ని అరికట్టడానికి ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 2% నుండి 15%కి పెంచింది. అలాగే బంగారు నాణేల దిగుమతిని నిషేధించి.. '80:20 రూల్' తెచ్చారు. అంటే దిగుమతి చేసుకున్న బంగారంలో 20% ఎగుమతి చేయాలి వంటి కఠిన నిబంధనలను తెచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని జెఫరీస్ హెచ్చరించింది.
బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాలను భారీగా పెంచాక కూడా ఒకవేళ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గకపోతే.. మరోసారి సుంకాల పెంపు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు రానున్న రోజుల్లో కేంద్రం జీఎస్టీ రేట్లను మళ్లీ సవరించే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు గోల్డ్ లోన్లపై ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇలాంటి చర్యల ద్వారా డాలర్ మారకపు విలువ దాదాపు 95 రూపాయిలు దాటేసిన వేళ రూపాయి మారకపు విలువను కాపాడేందుకే ఇలాంటి చర్యలకు దారితీసినట్లు తెలుస్తోంది.
భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడకుండా ఉండాలంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఆదా అవ్వాల్సిందే. సో భారతీయులు తమ బంగారం కొనుగోళ్లను కేవలం 10 శాతం తగ్గించుకున్నా, దేశానికి దాదాపు 7.2 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని నిపుణుల అంచనా. ఈ నిధులు క్రూడ్ దిగుమతులకు, ఇతర అభివృద్ధి పనులకు వాడుకోవచ్చని ఆర్థికవేత్త మనోరంజన్ శర్మ అన్నారు.
పెట్టుబడిదారులపై ప్రభావం ఎంత?
ప్రభుత్వ ప్రకటనలు, జెఫరీస్ హెచ్చరికల నేపథ్యంలో జ్యువెలరీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. అయితే టైటాన్ వంటి సంస్థలు ఇప్పుడు పాత బంగారం ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా తమ అవసరాలను తీర్చుకుంటున్నందున.. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత పటిష్టంగానే ఉన్నాయి. ప్రస్తుతానికి 2013 నాటి అంత తీవ్రమైన సంక్షోభం లేనప్పటికీ.. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం చేస్తున్న ఈ విజ్ఞప్తిని ఇన్వెస్టర్లు, సామాన్య ప్రజలు ఫాలో అవ్వక తప్పదు. మోడీ సర్కార్ రానున్న ఏడాదిలో తీసుకునే మరిన్ని చర్యలు మార్కెట్లను, బంగారాన్ని ఎలా ముందుకు తీసుకెళతాయో వేచి చూడాల్సిందే.
