- కొద్దిగా కోలుకున్న రూపాయి..1.6 శాతం జంప్తో 93.18 స్థాయికి
- ఇది12 సంవత్సరాల గరిష్టం
- ఆన్‌షోర్ డెరివేటివ్స్‌పై ఆంక్షలే కారణం
న్యూఢిల్లీ:
రూపాయి దూసుకెళ్లింది. డాలర్‌తో పోలిస్తే భారీగా పుంజుకుంది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో అత్యంత వేగంగా పెరిగింది. ఆన్‌షోర్ డెరివేటివ్స్‌పై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో గురువారం ట్రేడింగ్‌లో రూపాయి విలువ సుమారు 1.6 శాతం పెరిగి 93.18 వద్ద స్థిరపడింది. ఒకదశలో 92.94 వరకు వెళ్లింది. 2013 సెప్టెంబర్ తర్వాత రూపాయికి ఇదే అతిపెద్ద ఒకే రోజు లాభం. మార్కెట్ల బలహీనత, ఎఫ్ఐఐల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ మన కరెన్సీ రాణించడం విశేషం.
కరెన్సీలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను అరికట్టడానికి ఆర్బీఐ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. నివాసితులకు, అనివాసితులకు రూపాయి నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్డీఎఫ్) సేవలను బ్యాంకులు అందించకుండా నిషేధం విధించింది. హెడ్జింగ్ కోసం ఫారెక్స్ (ఎఫ్‌ఎక్స్) కాంట్రాక్టులను బ్యాంకులు అందించవచ్చు కానీ ఆన్‌షోర్ పొజిషన్లతో ఆ ట్రేడ్‌లను సరిచేయడానికి వీలుండదు. రద్దు చేసిన ఎఫ్‌ఎక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులను తిరిగి బుక్ చేయడానికి క్లయింట్లకు అనుమతి ఇవ్వవద్దని బ్యాంకులను ఆదేశించింది. సంబంధిత సంస్థలతో ఎటువంటి ఎఫ్‌ఎక్స్ డెరివేటివ్ ఒప్పందాలు చేసుకోవద్దని స్పష్టం చేసింది.
బ్యాంకులకు ఇబ్బందే..
బ్యాంకుల ఓపెన్ రూపాయి పొజిషన్లపై 100 మిలియన్ డాలర్ల పరిమితిని ఆర్బీఐ ఇటీవల నిర్ణయించింది. గతంలో ఇది బ్యాంకుల మూలధనంలో 25 శాతం వరకు ఉండేది. మార్చి నెలలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పడిపోయింది. గత ఆరేళ్లలో ఇదే అత్యంత దారుణమైన నెలవారీ పతనం. యుద్ధం వల్ల డాలర్ బలపడటంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. గత వారం రూపాయి విలువ మొదటిసారిగా 95 స్థాయిని దాటి రికార్డు కనిష్టానికి చేరింది. రూపాయిని ఆదుకోవడానికి ఆర్బీఐ అన్ని రకాల ఆంక్షలను అమలు చేస్తోందని జెఫరీస్ సంస్థ తెలిపింది. ఎఫ్‌ఎక్స్ డెరివేటివ్ నిబంధనలను కఠినతరం చేయడం వల్ల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల బ్యాంకులకు రూ.నాలుగు వేల కోట్ల నుంచి రూ.ఐదు వేల కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. గతంలో ఈ నష్టం రూ.మూడు వేల కోట్ల నుంచి రూ.ఐదు వేల కోట్ల మధ్య ఉంటుందని భావించారు.
- భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు
మార్కెట్లు గురువారం అద్భుత రికవరీని సాధించాయి. ఆరంభంలో 1,588 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, తర్వాత కోలుకుని 185 పాయింట్ల లాభంతో 73,319.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.70 పాయింట్లు పుంజుకుని 22,713.10 వద్ద స్థిరపడింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్లో జోష్ నింపాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు పెరిగాయి. రూపాయి పెరగడం సెంటిమెంట్‌ను బలపరిచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలతో క్రూడాయిల్ ధర ఏడు శాతానికిపైగా పెరిగి 108.52 డాలర్లకు చేరింది. ఎఫ్ఐఐలు రూ.8, 331 కోట్లు ఉపసంహరించుకున్నారు.
- లాభాలతో సాయి పేరెంటరల్ లిస్టింగ్
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాలతో బోణీ చేశాయి. రూ.392 ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం సుమారు 4 శాతం ప్రీమియంతో రూ.405 వద్ద లిస్ట్ అయ్యాయి. ట్రేడింగ్ సమయంలో షేరు ధర రూ.416 వరకు పెరిగింది. చివరకు బీఎస్ఈలో రూ.406.40 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో కూడా రూ.405 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,795 కోట్లుగా నమోదైంది.
