కొత్త కంపెనీల జోరు.. ఆరు నెలల్లో 1లక్షా20వేల 966 కంపెనీలు

కొత్త కంపెనీల జోరు.. ఆరు నెలల్లో 1లక్షా20వేల 966 కంపెనీలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దేశంలో కొత్త కంపెనీలు, లిమిటెడ్​ లయబిలిటీ పార్ట్​నర్షిప్​ల ఏర్పాటు రికార్డు లెవెల్​కి చేరింది. బిజినెస్​ క్లైమేట్​పట్ల ఆశావాదం, ఎకనమిక్​ గ్రోత్​పై నమ్మకం వల్లే కొత్త సంస్థల ఏర్పాటు జోరందుకుంటోందని సీనియర్​ గవర్నమెంట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. షార్ట్​టర్మ్​లో గ్లోబల్​ అనిశ్చితుల ఎఫెక్ట్​ ఉన్నప్పటికీ, మిడ్​టర్మ్​–లాంగ్​ టర్మ్​లలో బిజినెస్​లు బాగా నడుస్తాయనే ఆశావాదాన్ని ఈ ట్రెండ్​ రిఫ్లెక్ట్​ చేస్తుందని వారు పేర్కొన్నారు. 

ఏప్రిల్​–సెప్టెంబర్​ 2023 మధ్య కాలంలో దేశంలో కొత్తగా 1,20,966 కంపెనీలు, ఎల్​ఎల్​పీలు ఏర్పాటయినట్లు అఫీషియల్​ డేటా వెల్లడిస్తోంది. అంతకు ముందు ఏడాదిలోని 1,08,583 తో పోలిస్తే ఇది 11.4 శాతం ఎక్కువని మినిస్ట్రీ ఆఫ్​ కార్పొరేట్​ ఎఫెయిర్స్​ (ఎంసీఏ) డేటా చెబుతోంది. ఎంసీఏ 21 పోర్టల్​లో టెక్నికల్​ లోపాలపై కంప్లెయింట్లు ఎక్కువైన నేపథ్యంలో దేశంలో కంపెనీల ఏర్పాటు సంఖ్య భారీగా పెరగడం విశేషం. అంతేకాదు, షెల్​ కంపెనీలపై కొరడా విధించడంతోపాటు, కఠినమైన చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటోంది. 

అయినా, కొత్త బిజినెస్​ల ఏర్పాటు జోరందుకుంటోందని ఒక సీనియర్​ ఆఫీసర్​ పేర్కొన్నారు. రూల్స్​ పాటింపులోని ఇబ్బందులు తగ్గించే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కూడా కొత్త బిజినెస్​ల ఏర్పాటుకు ఒక కారణంగా వివరించారు. కంప్లయెన్స్​ భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని ఆయన చెప్పారు. 39 వేలకు పైగా పనికిరాని రూల్స్​ను ఎత్తివేయడంతోపాటు, 1,500 చట్టాలకు స్వస్తి పలికినట్లు కిందటి వారంలో ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ వెల్లడించిన విషయం తెలిసిందే.