నేలపై, సముద్రంలో, ఆకాశంలో రష్యా మిసైల్ టెస్టులు 

నేలపై, సముద్రంలో, ఆకాశంలో రష్యా మిసైల్ టెస్టులు 
  • కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించిన పుతిన్ 
  • ఉక్రెయిన్ ‘డర్టీ బాంబ్’ తయారు చేస్తోందంటూ ఆరోపణలు 

మాస్కో/కీవ్: ఉక్రెయిన్ పై అణు బాంబులు వేసేందుకూ వెనకాడబోమంటూ రెండు నెలలుగా హెచ్చరిస్తూ వస్తున్న రష్యా.. తాజాగా న్యూక్లియర్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో డ్రిల్స్ చేపట్టింది. బుధవారం నేలపై, సముద్రంలో, ఆకాశంలో ఒకేసారి ఈ మేరకు బాలిస్టిక్, క్రూయిజ్ మిసైల్ టెస్టులు నిర్వహించింది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా కంట్రోల్ రూం నుంచి ఈ డ్రిల్స్ ను పర్యవేక్షించారు. పుతిన్ నాయకత్వంలో గ్రౌండ్, సీ, ఎయిర్ స్ట్రాటజిక్ బలగాలు ఈ డ్రిల్స్ చేపట్టాయని రష్యన్ ప్రెసిడెంట్ అధికార భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్కిటిక్ లోని బారెంట్స్ సముద్రంలో ఓ సబ్ మెరైన్ నుంచి సినెవా బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించడం, రష్యన్ ఫార్ ఈస్ట్ ప్రాంతంలోని కంచత్కా నుంచి మిసైల్ టెస్టులు చేస్తున్న వీడియో ఫుటేజీలను రష్యన్ మీడియా చూపించింది.

మరోవైపు ఉక్రెయిన్ తమ దేశంపై ప్రయోగించేందుకు డర్టీ బాంబ్ (రేడియేషన్ లేదా కెమికల్స్ లేదా జీవాయుధాలతో కూడిన బాంబు)ను తయారు చేస్తోందంటూ కొద్దిరోజులుగా చెప్తూ వస్తున్న రష్యా.. బుధవారం ఇండియా, చైనాకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని తెలియజేసింది. కాగా, రష్యా ఆరోపణలు దారుణమని ఉక్రెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఖండించాయి. యుద్ధరంగంలో తన చర్యలను సమర్థించుకునేందుకే రష్యా ఇలా ఆరోపణలతో కవర్ చేసుకుంటోందని విమర్శించాయి.