ఆక్రమిత రీజియన్ల విలీనానికి ప్లాన్

ఆక్రమిత రీజియన్ల విలీనానికి ప్లాన్

వ్యతిరేకిస్తున్న ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు 

కీవ్: ఉక్రెయిన్​లో ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో  రెఫరెండం నిర్వహిస్తోంది. స్థానికులు రష్యాలో చేరేందుకు ఒప్పుకున్నారని ప్రపంచానికి చూపెట్టేందుకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉక్రెయిన్​పై యుద్ధం చేస్తోన్న రష్యా.. ఆ దేశంలోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపరోజియా రీజియన్లను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతాల్లో తమ అధికారులను నియమించింది. ఇప్పుడీ నాలుగు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ శుక్రవారం మొదలైందని మంగళవారంతో ముగుస్తుందని లోకల్ మీడియా పేర్కొంది. నాలుగు రోజుల పాటు అధికారులు ఇంటింటికీ తిరిగి బ్యాలెట్ పేపర్లు అందజేస్తారని, మంగళవారం ఎన్నిక జరుగుతుందని తెలిపింది. అధికారులు కాలనీల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పింది. ఈ నాలుగు ప్రాంతాల నుంచి రష్యాకు శరణార్థులుగా వెళ్లిన వాళ్లు కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం ఉందని వెల్లడించింది. వాళ్లందరూ రష్యాలోనే ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారంది. కాగా, రష్యాను ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. ఆ దేశం ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ దేశంలో విలీనమైనట్లు ప్రకటిస్తే ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోలేదనే ఉద్దేశంతో
రష్యా రెఫరెండం నిర్వహిస్తోంది.

అదంతా బూటకం: జెలెన్ స్కీ 

రష్యా చర్యను ఉక్రెయిన్ సహా పశ్చిమ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. రష్యా తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. రెఫరెండం ఒక బూటకమని అన్నారు. యుద్ధంలో పాల్గొనవద్దని రష్యా ప్రజలను కోరారు. ‘‘మీరు మౌనంగా ఉండడంతోనే ఇదంతా జరుగుతోంది. చావాలనుకుంటున్నారో? బతకాలనుకుంటున్నారో? మగవాళ్లు తేల్చుకోవాలి. తమ భర్తలను, పిల్లలను పోగొట్టుకుంటరో? కాపాడుకుంటరో? మహిళలు తేల్చుకోవాలి” అని రష్యా ప్రజలను ఉద్దేశించి అన్నారు. కాగా, 3 లక్షల మంది రిజర్వ్ దళాలను సమీకరిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రక్రియ మొదలైంది. చాలా మంది మాజీ సైనికులు తమ కుటుంబాలను వీడి యుద్ధానికి బయలుదేరుతున్న వీడియోలు రష్యన్ సోషల్ మీడియా సైట్లలో కనిపిస్తున్నాయి. 

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి మోడీతోనే సాధ్యం: మెక్సికో 

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడం మన ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమని మెక్సికో తెలిపింది. రెండు దేశాల మధ్య చర్చల కోసం మోడీ, పోప్ ఫ్రాన్సిస్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తో కమిటీ వేయాలని కోరింది. ఈ మేరకు ఉక్రెయిన్ అంశంపై న్యూయార్క్ లో జరిగిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిబేట్ లో మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్ ప్రతిపాదించారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేయాలన్నారు. కాగా, ఇటీవల ఉజ్బెకిస్తాన్ లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ సందర్భంగా పుతిన్​తో మోడీ భేటీ అయ్యారు. ‘‘ఇది యుద్ధాల కాలం కాదు” అని మోడీ ఆయనకు సూచించారు.