
మాస్కో: ఉక్రెయిన్లో జీవ ఆయుధాలను తయారు చేస్తున్నారని రష్యా ఆరోపించింది. దీనికి అమెరికా సహాయం ఎందుకు చేస్తోందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. బుధవారం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ లో జీవ ఆయుధాలు (శత్రుదేశాలపై ప్రయోగించేందుకు తయారు చేసే విషపూరిత కెమికల్స్ లేదా ప్రమాదకర వైరస్ ల వంటివి) తయారు చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయని ఆరోపించారు. జీవ ఆయుధాల తయారీ కోసం ఉక్రెయిన్ లో మిలిటరీ బయోలజికల్ ప్రోగ్రాంను చేపట్టారని, యుద్ధం ప్రారంభం కావడంతో ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. అమెరికా రక్షణ శాఖ నిధులు, సహకారంతోనే ఈ ప్రోగ్రాంను చేపట్టినట్లు తేలిందని, దీనిపై అమెరికా రక్షణ శాఖ, ప్రెసిడెంట్ ఆఫీస్ అధికారులు అధికారికంగా ప్రపంచానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సైంటిఫిక్ రీసెర్చ్ లో భా గంగా ఇలాంటి ప్రయోగాలు చేసుకోవచ్చని, కానీ మిలిటరీ ప్రోగ్రాం కింద వీటిని తయారు చేయడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అయితే, తాము ఎలాంటి బయోలజికల్ వెపన్స్ ను తయారు చేయడంలేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. రష్యా ఆరోపణలు అర్థంలేనివని అమెరికా
రక్షణ శాఖ కూడా ఖండించింది.