మీకు మేమున్నాం డోన్ట్ వర్రీ భారత్ అంటున్న రష్యా.. అమెరికా టారిఫ్స్‌కి చెక్‌..

మీకు మేమున్నాం డోన్ట్ వర్రీ భారత్ అంటున్న రష్యా.. అమెరికా టారిఫ్స్‌కి చెక్‌..

అమెరికా భారతదేశంపై రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపుతూ 25 శాతం సెకండరీ పన్నులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత ప్రస్తుతం భారత్ రష్యాల మధ్య సంబంధాలు మరింతగా బలపడుతున్నట్లు తాజా పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతోంది. తాజాగా ఆగస్టు 20న రష్యా రాయబార కార్యాలయ ప్రతినిధి రోమన్ బబుష్కిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా మార్కెట్లో భారత వస్తువులకు పెంచిన పన్నులు అవరోధాలను కలిగిస్తుంటే.. రష్యా తన మార్కెట్లను ఇండియన్ వస్తువుల కోసం పూర్తిగా తెరిస్తుందని చెప్పారు. యూఎస్ పెంచిన భారీ సుంకాల సమయంలో రష్యా.. భారత ఎగుమతులకు సురక్షిత మార్కెట్ అవుతుందని హామీ ఇచ్చారు.

ALSO READ : ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ రెడీ

గత కొన్ని వారాలుగా భారత-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై మెుత్తం 50 శాతం సుంకాలను ప్రకటించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. భారత్ దీనిని అన్యాయమైనవిగా అభివర్ణించింది. ఫలితంగా ఆగస్టు 25కి జరగాల్సిన వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. 

భారత్ చమురుకు ప్రధాన వినియోగదారుడైతే.. రష్యా ప్రపంచపు పెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరువురి పరస్పర సహకారం సహజసిద్ధం. బబుష్కిన్ తెలిపినట్టుగా “ప్రత్యేక విధానం” ద్వారా రష్యా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముడి చమురు అందిస్తూనే ఉంటుంది. యూరోపియన్ యూనియన్ గత నెలలో నయారా ఎనర్జీపై ఆంక్షలు విధించి సమస్యలు సృష్టించినా, రష్యా-భారత మైత్రి చెక్కుచెదరని సంకేతం ఇస్తోంది.

అమెరికాలో ఒత్తిళ్లు పెరిగే సమయంలో రష్యా మార్కెట్లు భారత తయారీ, వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త అవకాశాలను కల్పిస్తాయి. ఇది ఎగుమతిదారులకు నష్టాన్ని తగ్గిస్తుందని ఆయన మాటల ద్వారా అర్థం అవుతోంది. అమెరికా ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు రష్యాతో పాటు చైనా వంటి దేశాలతో సహకారం పెంచుకోవడం ద్వారా భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుత వాణిజ్య వాతావరణంలో రష్యా ఇస్తున్న బలమైన మద్దతు భారత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఎనర్జీ భద్రత, ఎగుమతుల స్థిరత్వం, కూటముల సమీకరణలోనూ రష్యాతో సంబంధాలు భారత్ కు తక్షణ లాభాలను తెచ్చేలా కనిపిస్తున్నాయని విశ్లేషకులు కూడా అంటున్నారు.