ఖేర్సన్​ను ఖాళీ చేశాం: రష్యా

ఖేర్సన్​ను ఖాళీ చేశాం: రష్యా

ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ పెట్టినట్లు ఉక్రెయిన్ అనుమానం

కీవ్: ఉక్రెయిన్ సిటీ ఖేర్సన్ నుంచి తమ బలగాలన్నీ వెనక్కి వచ్చేశాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది. నీపర్ నది పడమర ఒడ్డు నుంచి శుక్రవారం ఉదయం 5 గంటలలోపే బలగాల ఉపసంహరణ పూర్తయిందని పేర్కొంది. ఒక్క మిలటరీ యూనిట్ కూడా అక్కడలేదని రష్యా రక్షణ శాఖ పేర్కొన్నట్లు ఆ దేశ వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి. రష్యా బలగాలు ఖాళీచేసిన ప్రాంతాల్లో ఖేర్సన్ సిటీ కూడా ఉంది. ఖేర్సన్ ప్రాంతాన్ని రష్యాలో భాగంగానే చూస్తామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ఖేర్సన్​తో పాటు ఉక్రెయిన్​కు చెందిన ఇతర ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకుని సంబరాలు జరుపుకోవడంపై తమకు బాధలేదని పేర్కొన్నారు. 

కాగా ఖేర్సన్ ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు. కొన్ని వారాల క్రితమే ఆ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాల్లో రష్యా దాడులు చేసిందని ఆరోపించారు. ఖేర్సన్ సిటీపై రష్యా ఎప్పుడైనా దొంగదెబ్బ తీయవచ్చని  పేర్కొన్నారు. కాగా, రష్యా తన బలగాలను ఇంకా పూర్తిగా తరలించలేదని, బలగాలను ఖాళీ చేయించాలంటే కనీసం వారంరోజులు పడుతుందని మిలటరీ విశ్లేషకులు చెప్పారు. ఖేర్సన్ సిటీలో రష్యా బలగాలు ల్యాండ్ మైన్స్ పాతిపెట్టి ఉండవచ్చని ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ సలహాదారు మైఖాలో పోదోల్ యాక్ అనుమానం వ్యక్తంచేశారు.