కీవ్: రష్యా పశ్చిమ ప్రాంతాలపై ఉక్రెయిన్ 100కు పైగా డ్రోన్లతో ఆదివారం దాడికి యత్నించింది. అయితే, ఆ డ్రోన్లను రష్యా కూల్చివేసింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై ఉక్రెయిన్ ఈ స్థాయిలో డ్రోన్లు ప్రయోగించడం ఇదే మొదటిసారి. శనివారం రాత్రి ఉక్రెయిన్ ప్రయోగించిన 110 డ్రోన్లను కూల్చివేశామని ఈ మేరకు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
సరిహద్దు ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఆ డ్రోన్లను ప్రయోగించిందని, ఒక్క కర్స్క్ లోనే 43 డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది. అలాగే ఉక్రెయిన్ లోని క్రివిరిహ్ పై తాము బాలిస్టిక్ మిసైల్ తో దాడిచేశామని, ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. కాగా, దక్షిణ ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించిన జపోరిజియా ప్రాంతంలోని రష్యన్ బలగాల క్యాంపుపై ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. వందల గ్రెనేడ్లతో నింపిన రాకెట్ ను రష్యా బలగాలపై జారవిడిచింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.