
- ప్లాంట్ లోపల ఉన్న వారి పరిస్థితిపై ఆందోళన
- కొద్ది రోజుల క్రితం దాడులు చేయబోమని పుతిన్ ప్రకటన
- అందుకు విరుద్ధంగా దాడుల తీవ్రత పెంచిన బలగాలు
- తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సేనలు
కీవ్: పోర్ట్ సిటీ మరియుపోల్‌లోని అజోవ్ స్టల్ స్టీల్ ప్లాంట్ పై రష్యా మళ్లీ దాడులు చేస్తోంది. ప్లాంట్‌ను స్వాధీనం చేసుకునేందుకుగానూ ఎయిర్‌స్ట్రైక్స్‌ను ముమ్మరం చేసింది. మరియుపోల్ నుదాదాపు రష్యా స్వాధీనం చేసుకున్నా.. స్టీల్ ప్లాంట్‌లో మాత్రం దానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లే దారులన్నీ బంద్ చేసింది. ప్లాంట్‌లో ఉన్న వారికి ఆహారం, నీరు అందకుండా చేస్తోంది. రెండ్రోజుల క్రితం పుతిన్ మరియుపోల్‌కు విముక్తి కలిగించామని, అయితే స్టీల్ ప్లాంట్‌లోకి తమ సైనికులను పంపలేమని, దానికి బదులుగా ప్లాంట్‌ను చుట్టుముడతామని, ఈగను కూడా బయటకు వెళ్లనివ్వబోమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా రష్యా మళ్లీ స్టీల్ ప్లాంట్‌పై వైమానిక దాడులకు దిగింది.
బంకర్లలో చిన్నారులు, మహిళలు
11 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న అజోవ్ స్టల్ స్టీల్ ప్లాంట్‌లో సుమారు 2 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరికి అదనంగా వెయ్యిమంది వరకు పౌరులు ఉండొచ్చని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌పై రష్యా దాడుల విషయాన్ని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అడ్వయిజర్ ఒలేకీ అరెస్టోవిచ్ వెల్లడించారు. ప్లాంట్‌పై రష్యా మళ్లీ వైమానిక దాడులు చేస్తోందని, లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రెండ్రోజుల క్రితం పుతిన్ చెప్పిన మాటలకు ఇది వ్యతిరేకమన్నారు. రష్యా కొత్తగా ఇతర ప్రాంతాల్లో చేస్తున్న దాడులను తమ సేనలు తిప్పికొడుతున్నాయని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌లో తలదాచుకున్న చిన్నారులు, మహిళలకు సంబంధించిన వీడియోను ఆయన మీడియాకు రిలీజ్ చేశారు.
కొనసాగుతున్న తరలింపు
మరియుపోల్ నుంచి ప్రజల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా సిటీ దాటించే ప్రయత్నం చేస్తున్నామని ఉక్రెయిన్ డిప్యూటీ పీఎం ఇరినా వెరెస్చుక్ చెప్పారు. ఇక ఉక్రెయిన్‌లోని డాన్బాస్ రీజియన్‌పైనా దాడుల తీవ్రతను రష్యా పెంచింది. అయితే ఇక్కడ కూడా ఉక్రెయిన్ సేనలు రష్యా దాడులను తిప్పికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎనిమిది రష్యా ఎటాక్‌లను తిప్పికొట్టామని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి.
మాస్క్వా వార్‌షిప్ మునిగిపోయింది: రష్యా
మాస్కో: నల్ల సముద్రంలో మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్ షిప్ మునిగిపోయిందని రష్యా ప్రకటించింది. అగ్ని ప్రమాదం కారణంగా షిప్ దెబ్బ తిని మునిగిపోయినట్టు వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, 27 మంది గల్లంతయ్యారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. తమ దాడిలో మాస్క్వా షిప్ దెబ్బ తిని నీళ్లలో మునిగిపోయినట్టు కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయని రష్యా.. తాజాగా ఫైర్ యాక్సిడెంట్లో షిప్ దెబ్బ తిందని పేర్కొంది.
యూఎన్: ఉక్రెయిన్, రష్యా యుద్ధాని కి ముగింపు పలికేందుకు ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వచ్చే వారం రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. వేలాది ప్రాణాలు కాపా డేందుకు వెంటనే చర్యలు తీసుకోవా ల్సి ఉందని, ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనడం ద్వారా అక్కడ ఏర్పడిన మానవతా సంక్షోభానికి ముగింపు పలకాల్సి ఉందని, ఇందులో భాగం గా పుతిన్, జెలెన్స్కీతో భేటీ అవుతా నని గుటెరస్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 26న ఆయన మాస్కో చేరుకుంటార ని, తొలుత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో, ఆ తర్వాత పుతిన్‌తో భేటీ అవుతారని గుటెరస్ అధికార ప్రతినిధి చెప్పారు. ఏప్రిల్ 28న ఉక్రెయిన్ వెళ్లి ఆ దేశ ప్రెసిడెంట్
జెలెన్స్కీతో భేటీ అవుతారన్నారు.