మీపై అణు బాంబు వేయడానికి 200 సెకన్లు చాలు

మీపై అణు బాంబు వేయడానికి 200 సెకన్లు చాలు

మాస్కో: అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ మరోసారి రష్యా బెదిరింపులకు దిగింది. తమ హైపర్​సోనిక్​ న్యూక్లియర్​ మిసైల్​శాటన్​– 2తో బ్రిటన్​పై దాడి చేయడానికి 200 సెకన్లు చాలంటూ రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​ సలహాదారు ఒకరు హెచ్చరించారు. నాటోలో చేరేందుకు ఫిన్లాండ్​ సన్నాహాలు చేస్తుండటం, మరోవైపు స్వీడన్​ కూడా అదే దారిలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నందున రష్యాకు ఫ్రస్ట్రేషన్​ పెరిగిపోతోంది. ‘‘అమెరికా మమ్మల్ని రెచ్చగొడితే మంచిదే. మీ కోసం మా దగ్గర శాటన్​ –2 ఉంది. రష్యా ఉనికిలో ఉండకూడదని మీరు అనుకుంటే మీకు మిగిలేది అణు బూడిదే. అమెరికాతో కలిసి ఉన్నామని ఫిన్లాండ్​ చెబుతోంది. ఒకవేళ నాటోలో చేరాలని ఫిన్లాండ్​ అనుకుంటే.. మా లక్ష్యం కచ్చితంగా చట్టబద్ధమైనదే అవుతుంది” అని రష్యా డిఫెన్స్​ కమిటీ డిప్యూటీ చైర్మన్ అలెక్సీ జురవ్​లియోవ్​ అన్నారు. న్యూక్లియర్​ వెపన్స్​ను రష్యా సరిహద్దుల్లోకి చేరుస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ఆ అవసరంలేదని, శాటన్​–2ను సైబీరియా నుంచి ప్రయోగించవచ్చని, అదే కలినింగ్​గ్రాడ్​ నుంచి ప్రయోగిస్తే 200 సెకన్లలోనే మిసైల్​ బ్రిటన్​ను చేరుకుంటుందని చెప్పారు. ఫిన్లాండ్​ బార్డర్​లో తమకు వ్యూహాత్మక ఆయుధాలు లేవని, కింజల్​ క్లాస్​కు చెందిన వెపన్స్​ అయితే 20 లేదా 10 సెకన్లలోనే ఫిన్లాండ్​కు చేరుతాయని అన్నారు. తమ దేశ భద్రత విషయంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. రష్యా గత నెలలో ఖండాంతర క్షిపణి అయిన శాటన్​–2ను పరీక్షించింది. ఈ మిసైల్​​ అమెరికా, యూరోప్​ను టార్గెట్​ 
చేయగలదని వెల్లడించింది.

ఖార్కివ్​ నుంచి రష్యా సేనలు వెనక్కి
ఉక్రెయిన్​లో రెండో అతి పెద్ద నగరమైన ఖార్కివ్​ నుంచి రష్యా తన బలగాలను వెనక్కి తీసుకుందని ఉక్రెయిన్​ మిలిటరీ వెల్లడించింది. అయితే ఉక్రెయిన్​ తూర్పు వైపు మాత్రం యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నట్టు తెలిపింది. యుద్ధంలో మరో కీలక దశకు చేరుకున్నామని ఉక్రెయిన్​ రక్షణ మంత్రి ఒలెక్సి రెజ్నికోవ్​ చెప్పారు. చొరబాటుదారులను తరిమికొట్టేందుకు ఉక్రెయినియన్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, యూరోప్, ఇతర మిత్ర దేశాలు అందించే సాయం ఆధారంగానే ఈ యుద్ధంలో ఫలితం ఆధారపడి ఉంటుందని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ చెప్పారు. యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయం ఇప్పుడు ఎవరూ చెప్పలేరన్నారు.