మార్షల్ లా భయంతో రష్యా విడిచిపోతున్న జనం

మార్షల్ లా భయంతో రష్యా విడిచిపోతున్న జనం

రష్యాలో 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న పురుషులకు విమాన టికెట్లు విక్రయించడాన్ని రష్యన్ ఎయిర్‌లైన్స్ నిలిపేశాయి. రష్యా రక్షణ శాఖ పర్మిషన్ అనుమతి పొందిన యువకులను మాత్రమే దేశం విడిచి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. రష్యాలో 3 లక్షల రిజర్వు దళాలను వెంటనే యుద్ధ రంగానికి తరలించాలన్న పుతిన్ నిర్ణయం ఆ దేశ ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. మార్షల్ లా విధిస్తారనే భయంతో భారీ సంఖ్యలో జనం రష్యాను వదిలి విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాల రద్దీ పెరిగింది. 

డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఫ్లైట్ టికెట్ల రేట్లు సైతం భారీగా పెరిగాయి. రష్యాకు సమీపంలో ఉన్న ఆర్మేనియా, జార్జియా, అజర్‌ బైజాన్, కజకిస్థాన్ తదితర దేశాలకు విమాన టికెట్లన్నీ అమ్ముడుపోయాయని ఏవియా సేల్స్ వెబ్‌సైట్ ప్రకటించింది. రష్యా నుంచి రాకపోకలకు ట్రావెల్ హబ్‌గా పరిగణించే ఇస్తాంబుల్‌కు సైతం శనివారం వరకు టికెట్ల బుకింగ్ ఫుల్ అయిపోయింది.

ఇదిలా ఉంటే లుహాన్స్క్, డొనేట్స్క్ ప్రాంతాల్లో ఈ వారంతంలో రెఫరెండం నిర్వహించే అవకాశముంది. ఈ రెఫరెండంలో ఆ ప్రాంత ప్రజలు రష్యా వైపు మొగ్గు చూపితే.. ఉక్రెయిన్‌కు చెందిన ఈ భాగాలు రష్యాలో కలవనున్నాయని ఫార్చ్యూన్ తెలిపింది.