
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని వారాలుగా రష్యా – నార్త్ కొరియా దేశాలకు చెందిన స్పాన్సర్డ్ హ్యాకర్స్ సైబర్ అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 7 కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించేందుకు భారత్, కెనడా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, యూఎస్ దేశాలపై హ్యాకర్స్ సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.
రష్యాకు చెందిన స్ట్రాంటియం మరియు ఫ్యాన్సీ బీర్ అదే విధంగా నార్త్ కొరియా కు చెందిన జింక్, సీరం పేరుతో హ్యాకర్స్ గ్రూప్ ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తమవద్ద సమాచారం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది.
అందులో స్ట్రాంటియం కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు చేసే సంస్థలకు చెందిన కంప్యూటర్ల లాగిన్ డీటెయిల్స్ ను దొంగిలించేందుకు రకరకాల పాస్ వర్డ్ లను (బ్రూట్ ఫోర్స్) ఉపయోగిస్తారు. జింక్ ఈమెయిల్స్ ( స్పియర్-ఫిషింగ్ ) ద్వారా యూజర్లను అట్రాక్ట్ చేసే ఆఫర్లను మెయిల్ చేసి.., డబ్ల్యూహెచ్ ఓ ప్రతినిధులమంటూ ఆ మెయిల్ ద్వారా పాస్ వర్డ్ డీటెయిల్స్ దొంగిలించేలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ మైక్రోసాఫ్ట్ కస్టమర్ సెక్యూరిటీ & ట్రస్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ టామ్ బర్ట్ చెప్పారు. అయితే హ్యాకర్స్ పట్ల అప్రమత్తంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని వెల్లడించారు.