
ఉక్రెయిన్ ను వీలైనంత వేగంగా లొంగదీసుకునేందుకు రష్యా అణుపదార్థాలతో చెలగాటమాడుతోంది. యూరప్ లోనే అతి పెద్దదైన జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై బాంబుల వర్షం కురిపించారు. న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర మంటలు చెలరేగడంతో.. ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశాయి. అయితే జపోరిజియా న్యూక్లియర్ ప్లాంటును రష్యన్ బలగాల తమ ఆధీనంలోకి తీసుకున్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్లాంట్ లోపలికి రష్యా సైనికులు వెళ్లారని తెలిపింది. దాడులు జరిగిన కొన్ని గంటలకే న్యూక్లియర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి న్యూక్లియర్ ప్లాంటు దగ్గర రేడియేషన్ స్థాయి పెరగలేదని వెల్లడించింది.
Russian military forces have seized the Zaporizhzhia nuclear power plant in Ukraine's southeast, a local authority said on Friday: Reuters #RussiaUkraineCrisis
— ANI (@ANI) March 4, 2022
రష్యాను తప్పుబట్టిన ప్రపంచ దేశాలు
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. పవర్ ప్లాంట్ పై దాడుల గురించి అమెరికా, బ్రిటన్, కెనడా ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్ లో మాట్లాడారు. న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి వల్ల ఐరోపా ఖండానికే ముప్పు ఉందని బ్రిటన్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు బ్రిటన్ చేయాల్సిందంతా.. చేస్తుందన్నారు. యూఎన్ భద్రతా మండలి సమావేశం జరపాలని ఆయన కోరారు.