తూర్పు ఉక్రెయిన్​పై పట్టుకోల్పోతున్న పుతిన్

తూర్పు ఉక్రెయిన్​పై పట్టుకోల్పోతున్న పుతిన్

కీవ్: ఖార్కివ్ ప్రావిన్స్​లోని డోనెట్స్క్ నదిపై ఉన్న ఇజియం నగరాన్ని రష్యా బలగాలు వీడాయి. రష్యాకు ఇది ఓ అవమానకరమైన ఓటమి అని ఉక్రెయిన్​ పేర్కొంది. రైల్వే హబ్​గా ఉన్న కుపియాన్స్క్​ నగరాన్ని ఉక్రెయిన్​ బలగాలు స్వాధీనం చేసుకుని.. సిటీ హాల్​ ముందు జెండా ఎగురవేశాయని తెలియగానే.. రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. నార్త్  అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తున్న ఆయుధాలతో రష్యా దూకుడును ఉక్రెయిన్ అడ్డుకుంటున్నది. మార్చిలో కీవ్​ను స్వాధీనం చేసుకునేందుకు కూడా రష్యా బలగాలు ప్రయత్నించి ఓడిపోయాయి. కాగా, ఇజియం నగరాన్ని విడిచి వచ్చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం రీ యూనిట్ కోసమేనని రష్యా రక్షణ శాఖ 
ప్రకటించింది. 

రష్యా ఓటమి ఖాయం: జెలెన్‌‌స్కీ 
ఉక్రెయిన్‌‌లో తూర్పు ప్రాంత పట్టణాల నుంచి రష్యన్ బలగాలు క్రమంగా వెనక్కి మళ్లుతున్నాయని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​ స్కీ చెప్పారు. 2వేల చదరపు కిలో మీటర్ల మేర తమ భూ భాగాన్ని రష్యా దళాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నామని, రష్యా పరాజయం ఖాయమైందని జెలెన్​ స్కీ చెప్పారు.

జపరోజియా ప్లాంట్​ క్లోజ్​
యూరప్‌‌లోని అతిపెద్ద అణు కర్మాగారం జపరోజియాను ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌‌కు తిరిగి కనెక్ట్ చేశారు. ఆపై ప్లాంట్​లోని చివరి రియాక్టర్​ను క్లోజ్​ చేశారు. రష్యా దాడుల కారణంగా ఇంజనీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లాంట్​లో 6 న్యూక్లియర్​ రియాక్టర్లు ఉండగా.. రష్యా షెల్లింగ్​ కారణంగా ఇప్పటిదాకా ఒకే రియాక్టర్​ను ఆపరేట్​ చేస్తూ వచ్చారు.