
కీవ్: కాల్పుల విరమణ చర్చలకు ముందు ఉక్రెయిన్ పై రష్యా శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో భీకరంగా దాడి చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఐదేండ్ల చిన్నారి కూడా ఉన్నది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కివ్, సుమి, చెర్నిహివ్, ఒడెసా, డొనెట్స్క్ ప్రాంతాల మీదా రష్యా అటాక్ చేసింది. కీవ్‌లో జరిగిన దాడిలో ఐదేండ్ల చిన్నారి సహా ముగ్గురు చనిపోయారు. పది మంది గాయపడ్డారు. రష్యా మొత్తం 147 డ్రోన్లను లాంచ్ చేసిందని, వాటిలో 97 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
25 డ్రోన్లు టార్గెట్‌ను రీచ్ కాలేదని వెల్లడించారు. ఎయిర్ డిఫెన్స్ కౌంటర్ అటాక్ నుంచి తప్పించుకుంటూ వెళ్తున్న డ్రోన్లు నిప్రో జిల్లాలో నివాస భవనాల మీద పడ్డాయని, దీంతో రెండు బిల్డింగుల్లో మంటలు అంటుకున్నాయని చెప్పారు. అలాగే, తొమ్మిది అంతస్తుల భవనంలోని టాప్ ఫ్లోర్లలో కూడా మంటలు అంటుకోవడంతో ఓ మహిళ చనిపోయిందని వివరించారు. ‘‘పోదిల్ జిల్లాలోనూ ఓ భవనంలోని 20వ అంతస్తులో మంటలు చెలరేగాయి. హోలోసివిస్కీలో ఓ గిడ్డంగి, ఆఫీసు భవనంలో కూడా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ మంటల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మిగతా చోట్ల నలుగురు మృతి చెందారు.
కీవ్ పై దాడులు నిత్యకృత్యం: జెలెన్ స్కీ
ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన తాజా దాడులపై ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. కీవ్‌లో దాడులు నిత్యకృత్యంగా మారాయని, ఈ దాడులకు తాము అలవాటుపడ్డామని పేర్కొన్నారు. గడిచిన వారంలోనే 1580 గైడెడ్ ఏరియల్ బాంబులు, 1100 డ్రోన్లు, 15 మిసైళ్లను రష్యా తమపై ప్రయోగించిందన్నారు. దీనికి కొత్త పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. కాగా.. ఉక్రెయిన్ కూడా శనివారం రాత్రి తమపై డ్రోన్లతో అటాక్‌కు యత్నించిందని, 59 డ్రోన్లను కూల్చివేశామని రష్యా అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సౌదీ అరేబియాలో నేడు చర్చలు
కాల్పుల విరమణపై ఉక్రెయిన్, రష్యా సోమవారం సౌదీలో చర్చలు జరపను న్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలు జరగనున్నా యి. ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం యూఎస్ అధికారులతో భేటీ కానుంది.