భారతీయులను పొగడ్తలతో ముంచెత్తిన రష్యా అధ్యక్షుడు పుతిన్

భారతీయులను పొగడ్తలతో ముంచెత్తిన రష్యా అధ్యక్షుడు పుతిన్

 ‘నేషనల్ యూనిటీ డే’లో పుతిన్ ​

మాస్కో:  ఇండియన్లు చాలా తెలివైన వాళ్లు అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మళ్లీ పొగడ్తలతో ముంచెత్తారు. దేశ అభివృద్ధిలో అద్భుతమైన ఫలితాలను సాధించడంలో సమర్థులు అని మెచ్చుకున్నారు. రష్యా ‘నేషనల్​ యూనిటీ డే’ సందర్భంగా శుక్రవారం మాస్కోలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. ‘‘ఒకసారి ఇండియాను చూడండి. అక్కడ ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు.

వారంతా చాలా సమర్థులు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంటారు. అభివృద్ధిలో ఇండియా అద్భుతమైన పనితీరును చూపుతోంది. దాదాపు150 కోట్ల వరకు ఉన్న ఇండియన్లు.. వారి అభివృద్ధిలో అద్భుత ఫలితాలు సాధిస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు” అని పుతిన్ కొనియాడారు. మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఈ నెల 7, 8 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్న నేపథ్యంలో మూడు రోజుల ముందుగా ఇండియాపై పుతిన్ ​ప్రశంసల వర్షం కురిపించడం గమనించదగ్గ విషయం.