పిల్లలతో సహా 25 మంది మృతి..
పోక్రోవ్స్క్ (ఉక్రెయిన్): ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్లతో విరుచుకుపడింది. సెంట్రల్ డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో దాదాపు 3,500 మంది జనాభా ఉన్న చాప్లిన్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో 25 మంది చనిపోయారు. అందులో 11 ఏండ్ల బాలుడు కూడా ఉన్నాడు. రైల్వే స్టేషన్‌కు దగ్గరలోనే కారు కాలిపోయిన ఘటనలో 6 ఏండ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయిందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మొత్తం 31 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆఫీస్‌లో డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో తెలిపారు. రష్యా దాడి అత్యంత క్రూరమైందన్నారు. సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేస్తోందని మండిపడ్డారు.
నికోపోల్ నగరంపై దాడి
ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్ తూర్పు ప్రాంతంలో జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారని, మరొకరు గాయపడ్డారని గవర్నర్ పావ్లో కైరిలెంకో టెలిగ్రామ్‌లో తెలిపారు. నికోపోల్ నగరంపై రష్యన్ ఆర్మీ షెల్లింగ్స్‌తో దాడికి తెగబడిందని డ్నిప్రోపెట్రోవ్స్క్ గవర్నర్ వాలెంటైన్ రెజ్నిచెంకో తెలిపారు. దాడులపై రష్యా స్పందించింది. ఉక్రెయిన్ సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించారు. పౌర ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
