ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. రాడార్లకు చిక్కదు. మిసైళ్లకు అందదు. ఏం చేసినా కూల్చివేయడం మాత్రం అసాధ్యం. అవసరమైతే.. రోజుల తరబడి ఆకాశంలో ఆగకుండా చక్కర్లు కొట్టగలదు. ఎంత పకడ్బందీగా డిఫెన్స్ సిస్టం ఏర్పాటు చేసుకున్నా.. లూప్ హోల్స్ ను గుర్తించి మరీ, దూసుకెళ్లి టార్గెట్లను చిటికెలో నేలమట్టం చేయగలదు! ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రపంచంలో ఏ మూలనైనా సరే.. ఆకాశం నుంచి పిడుగులు విరుచుకుపడినట్లు వెళ్లి అణుబాంబులు కురిపించగలదు! అదే.. రష్యా తయారు చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిసైల్… బూరెవెస్టినిక్. దీనికి స్కై ఫాల్ అనే మరో పేరు కూడా ఉంది. ప్రపంచంలోని మిసైళ్లన్నింటినీ తలదన్నేలా ఓ సూపర్ మిసైల్‌ను తయారు చేయాలన్న రష్యా కలకు ఈ మిసైల్ ప్రతిరూపం. ఈ దిశగా రష్యా విజయవంతంగా ముందుకెళుతోందని, మరో ఆరేళ్లలోపే ఈ సూపర్ వెపన్‌ను సిద్ధం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల వెల్లడించాయి.
అణు ఇంధనంతోటే అంత శక్తి
ఒక మిసైల్ ఆకాశంలో రోజుల తరబడి తిరగాలంటే అందుకు సరిపోయేంత ఇంధనం నింపడం అయ్యే పని కాదు. అందుకే.. స్కై ఫాల్ మిసైల్‌కు అణు విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అణు ఇంధనం చైన్ రియాక్షన్‌తో ఎక్కువ శక్తిని, ఎక్కువ కాలం ఇవ్వగలుగుతుంది కాబట్టే.. ఈ మిసైల్‌కు ఇంత పవర్ వస్తుందన్నమాట. అయితే, ఈ మిసైల్ తయారీ కోసం రష్యా ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా ప్రతి సారీ ఫెయిల్అవుతూ వస్తోంది. నవంబరు 2017, ఫిబ్రవరి 2018 మధ్య నాలుగు సార్లు, ఈ ఏడాది మొదట్లో ఒకసారి, గత నెలలో మరో సారి ఈ మిసైల్‌ను పరీక్షించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతి పరీక్షలోనూ ఈ మిసైల్ ఫెయిలై కూలిపోయిందని చెబుతున్నారు. అయినా సరే.. ఈసారి కచ్చితంగా వీలైనంత త్వరలో దీనిని సక్సెస్చేయాలని రష్యా పట్టుదలతో ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు అంటున్నాయి.
స్కై ఫాల్టెస్ట్ వల్లే గత నెలలో పేలుడు?
గత నెల 8న రష్యా సమీపంలోని వైట్ సీలో ఓ మిసైల్టెస్ట్ సందర్భంగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో మామూలు కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా రేడియేషన్ వెలువడటంతో దాదాపు ఐదుగురు సైంటిస్టులు, టెక్నీషియన్లు చనిపోయారు. అయితే, ఈ వార్తలను రష్యా ఖండించింది. కానీ ఆ పేలుడు వెనక నిజాలేమిటన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే, బూరెవెస్టినిక్ మిసైల్ సముద్రంలో కూలిపోతే, దానిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే ఆగస్టు 8న ఈ పేలుడు జరిగిందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లోనే ఈ మిసైల్‌కు న్యూక్లియర్ పవర్‌ను ఇచ్చే సిస్టంను రష్యా విజయవంతంగా పరీక్షించిందని, అప్పటి నుంచే దీని తయారీలో వేగం పుంజుకుందని భావిస్తున్నారు. అయితే, దీని గురించి రష్యా ఎలాంటి వివరాలను బయటపెట్టడం లేదు. ఇది ఒక అన్లిమిటెడ్ రేంజ్, అన్లిమిటెడ్ పవర్‌ఉన్న మిసైల్ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
