రష్యా దిగ్బంధం వల్ల ప్రపంచానికి ఆకలి కేకలు

రష్యా దిగ్బంధం వల్ల ప్రపంచానికి ఆకలి కేకలు
  • పోర్టుల్లో ఎగుమతులు నిలిచిపోయినయ్ : జెలెన్‌స్కీ
  • చర్చలు జరిపేందుకు రష్యా రెడీగా లేదని ఫైర్
  • ఆ దేశాన్ని పూర్తిగా స్విచ్చాఫ్ చేయాలని పిలుపు 

కీవ్: ఉక్రెయిన్‌లోని నల్ల సముద్ర పోర్టులను రష్యా దిగ్బంధించడం వల్ల కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు. పోర్టులను ముట్టడించిన కారణంగా భారీ మొత్తంలో గోధుమలు, మొక్కజొన్నలు, ఆయిల్‌, ఇతర ఉత్పత్తులను తాము ఎగుమతి చేయలేకపోతున్నామని, ప్రపంచం ఆహార సంక్షోభం అంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం టెలివిజన్ అడ్రస్‌లో మాట్లాడిన జెలెన్‌స్కీ.. ‘‘పదుల సంఖ్యలో దేశాల్లో ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. నల్ల సముద్రంలో రష్యా దిగ్బంధం కొనసాగితే.. కోట్లాది మందికి ఆకలి కేకలు తప్పవు’’ అని చెప్పారు. యుద్ధంలో ఉక్రెయిన్‌లోని చాలా వరకు పోర్టులను రష్యా తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అనేక దేశాల్లో ఆహార ధాన్యాల రేట్లు పెరగడానికి కూడా ఇది కారణమైంది. 

సెవెరోడోనెట్స్క్ పైనే డాన్‌బాస్ భవిష్యత్తు

సెవెరోడోనెట్స్క్ కోసం జరుగుతున్న పోరు.. డాన్‌బాస్‌ తలరాతను నిర్ణయిస్తుందని జెలెన్‌స్కీ చెప్పారు. ‘‘ఇది చాలా క్రూరమైన యుద్ధం. కఠినమైనది. ఈ పోరులో అత్యంత కష్టమైనది కూడా. డాన్‌బాస్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌‌కు సెవెరోడోనెట్స్క్ కీలక కేంద్రంగా మారింది’’ అని అన్నారు. సెవెరోడోనెట్స్క్లో జరుగుతున్న పోరాటంలో ఉక్రెయిన్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే వీలైనంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పాయి. ఇక లుహాన్స్క్ ప్రావిన్సు మొత్తం బాంబులతో ధ్వంసమైన శిథిల భూమిగా మారింది. ప్రధాన నగరం పూర్తిగా నాశనమైందని లుహాన్స్క్ రీజినల్ గవర్నర్ సుర్హీయ్ గయ్‌డయ్‌ చెప్పారు.

రష్యాను బలహీనం చేయాలె 

యుద్ధాన్ని ముగించడం కోసం రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యాను బలహీనపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను పూర్తిగా స్విచ్చాఫ్ చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు రష్యాతో పోరులో రోజూ 100 మంది తమ సైనికులు చనిపోతున్నారని ఉక్రెయిన్ రక్షణ మంత్రి చెప్పారు.

రష్యన్లు రాకపోయి ఉంటే..:

బాంబుదాడులకు ధ్వంసమైన స్కూలు బిల్డింగ్ ముందు అందమైన బాల్ డ్రెస్ వేస్కుని నిల్చున్న ఈ మె ఉక్రెయిన్ స్టూడెంట్ అన్నా ఎపిషేవా. హైస్కూల్ ఫేర్ వెల్ డే రోజున వేసుకునేందుకని ఈమె గతంలోనే ఈ డ్రెస్ ను సిద్ధం చేసుకుంది. ఇంతలోనే రష్యన్లు దండయాత్ర చేసి ఇలా తన కలలన్నీ కల్లలు చేశారు. చివరకు స్కూలు శిథిలాల వద్దే ఇటీవల ఇలా ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టింది. ఉక్రెయిన్ దుస్థితిని ప్రపంచానికి చాటింది.