రష్యాకు ఆపతి వచ్చిందంటే.. అణుబాంబులు వాడుడే

రష్యాకు ఆపతి వచ్చిందంటే.. అణుబాంబులు వాడుడే
  • పుతిన్​వి ఉత్త మాటలు కాదు
  • రష్యాకు ఆపతి వచ్చిందంటే.. అణు బాంబులు వాడుడే
  • సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ మెద్వదేవ్ హెచ్చరిక

మాస్కో: తమ దేశానికి ముప్పు వచ్చిందంటే దేనికీ వెనకాడబోమని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ దిమిత్రి మెద్వెదేవ్ హెచ్చరించారు. ఆపతి ఒక స్థాయికి మించిందంటే ఉక్రెయిన్​పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని మంగళవారం తేల్చి చెప్పారు. అందుకు ఎవరినీ పర్మిషన్ అడగనవసరం లేదని, చర్చలతో పనిలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయంలో వెస్ట్ దేశాలు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదని అన్నారు. దేశ ప్రజలకు ఆపతి వచ్చిందంటే న్యూక్లియర్ వెపన్స్ తో సహా అన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తామని ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన మాటలు ఉత్తవేం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం ఉక్రెయిన్​ను భయపెట్టేందుకే పుతిన్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని పశ్చిమ దేశాలు అనుకుంటున్న నేపథ్యంలో మెద్వెదేవ్ ఇలా స్పందించారు. ‘‘రష్యా ఉనికికి ప్రమాదం వాటిల్లితే, రష్యా దురాక్రమణకు గురైతే.. ఉక్రెయిన్​పై అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఆ సందర్భంలో నాటో జోక్యం చేసుకోదని నేను నమ్ముతున్నా”అని మెద్వెదేవ్ పేర్కొన్నారు. 

టార్గెట్ ఉక్రెయిన్..

ఉక్రెయిన్​పై దాడులు ప్రారంభించి 7 నెలలు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో పురోగతి లేకపోగా, రష్యా ఇప్పటికే ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. మరోపక్క రష్యా ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. మిత్రదేశాల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సైన్యాన్ని పెంచే దిశగా రిటైర్డ్ ఆర్మీని మళ్లీ రంగంలోకి దించేందుకు రష్యా సిద్ధమైంది. ఉక్రెయిన్​లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో రిఫరెండం మొద లుపెట్టింది. ఆపై ఆ ప్రాంతాలన్నీ రష్యా సార్వభౌమత్వం కింద ఉన్నట్లు ప్రకటించాలన్నది పుతిన్ ఆలోచన అని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. ఆ ప్రాంతాల పై ఉక్రెయిన్​ దాడిచేస్తే అది రష్యాపై దాడిగానే పరిగణించి ఎలాంటి వెపన్స్ అయినా ఉపయోగించవచ్చని పాశ్చాత్య దేశాలు అనుమానిస్తున్నాయి.