సౌతాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు ఆదివారం (నవంబర్ 23) బీసీసీఐ స్క్వాడ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న జరగబోయే తొలి వన్డేకు రోహిత్ శర్మతో పాటు టీమిండియా ఇన్నింగ్స్ ను ఎవరు ఓపెన్ చేస్తారనే విషయంలో చర్చ జరుగుతోంది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ శుభమాన్ గిల్ దూరం కావడంతో సూపర్ ఫామ్ లో ఉన్న ఋతురాజ్ గైక్వాడ్ కు స్క్వాడ్ లో దక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎప్పటి యశస్వి జైశ్వాల్ ఎప్పటి నుంచో భారత వన్డే స్క్వాడ్ లో ఉంటున్నాడు. వీరిద్దరిలో రోహిత్ తో కలిసి ఓపెనర్ గా ఎవరిని పంపాలో జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.
గైక్వాడ్ కంటే ముందే బ్యాకప్ ఓపెనర్ గా ఉన్న జైశ్వాల్ కు గిల్ లేకపోవడంతో లైన్ క్లియర్ అయిందని భావించారు. అయితే ప్రస్తుతం గైక్వాడ్ ఉన్న ఫామ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ మహారాష్ట్ర క్రికెటర్ ఓపెనింగ్ లో గట్టి పోటీనిస్తున్నాడు. వాస్తవానికి జైశ్వాల్ కంటే ముందే ఋతురాజ్ వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు గైక్వాడ్ ఆరు వన్డేలాడితే.. జైశ్వాల్ ఒకటే వన్డే ఆడాడు. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే సౌతాఫ్రికా -ఏ తో జరిగిన సిరీస్ లో గైక్వాడ్ టాప్ రన్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో వరుసగా 17, 68*, 25 పరుగులను చేశాడు.
లిస్ట్ ఎ క్రికెట్‌లో కూడా జైస్వాల్ కంటే గైక్వాడ్ కు మంచి గణాంకాలు ఉన్నాయి. ఈ సూపర్ కింగ్స్ కెప్టెన్ 89 లిస్ట్ ఎ మ్యాచ్ లలో 57 యావరేజ్ తో 4534 పరుగులు చేశాడు. ఈ రెండు కారణాల వలన గైక్వాడ్ ను హిట్ మ్యాన్ కు ఓపెన్ పార్ట్ నర్ గా పంపే అవకాశం ఉంది. మరోవైపు జైశ్వాల్ ఇప్పటివరకు ఒకటే వన్డే ఆడి 15 పరుగులు మాత్రమే చేశాడు. పెద్దగా వన్డే అనుభవం లేకపోవడంతో ఈ యువ ఓపెనర్ ఎలా ఆడతాడో ఒక అంచనాకు రావడం కష్టం. ఒకవేళ లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం ఆలోచిస్తే జైశ్వాల్ కు ఛాన్స్ లభిస్తోంది. దీర్ఘకాలిక ఓపెనర్ గా జైశ్వాల్ ను తయారు చేయాలనుకుంటే అవకాశం దక్కొచ్చు.
