IND vs SA: అయ్యర్ స్థానంలో వచ్చి అదరగొట్టాడు: రెండో వన్డేలో గైక్వాడ్ మెరుపు సెంచరీ

IND vs SA: అయ్యర్ స్థానంలో వచ్చి అదరగొట్టాడు: రెండో వన్డేలో గైక్వాడ్ మెరుపు సెంచరీ

టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. సౌతాఫ్రికాపై రెండో వన్డేలో సెంచరీతో దుమ్ములేపాడు. బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో 77 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. గైక్వాడ్ వన్డే కెరీర్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇన్నింగ్స్ 34 ఓవర్లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.         

తొలి వన్డేలో 8 పరుగులే చేసి నిరాశపరిచిన గైక్వాడ్ రెండో వన్డేలో ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లను అలవోకగా ఆడేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గైక్వాడ్.. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో పరుగుల వరద పారించాడు. సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 52 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత గైక్వాడ్ గేర్ మార్చాడు. బౌండరీలు కొడుతూ దూకుడు పెంచాడు. మహారాజ్ వేసిన ఇన్నింగ్స్ 28 ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. ఇదే ఊపులో తన వన్డే కెరీర్ లో తొలి సెంచరీ అందుకున్నాడు. 

ALSO READ : ద్రవిడ్‌ను వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ..

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. గైక్వాడ్ సెంచరీతో పాటు కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో ప్రస్తుతం ఇండియా 34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (92), గైక్వాడ్ (101) ఉన్నారు. ఈ మ్యాచ్ లోనూ ఇండియా 350 పరుగుల దిశగా దూసుకెళ్తుంది. ఓపెనర్లు జైశ్వాల్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. 22 పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ శర్మ 14 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, బర్గర్ తలో వికెట్ తీసుకున్నారు.