
- రికెల్టన్ సూపర్ సెంచరీ
- రాణించిన బవూమ, డసెన్,
- రహ్మత్ షా పోరాటం వృథా
కరాచీ: వరుసగా ఐదు వన్డేల్లో ఓడి చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన సౌతాఫ్రికా మెగా టోర్నీలో శుభారంభం చేసింది. రైన్ రికెల్టన్ (106 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 103) సెంచరీతో చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 107 రన్స్ తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది.
టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత 50 ఓవర్లలో 315/6 స్కోరు చేసింది. కెప్టెన్ బవూమ (58), డసెన్ (52), మార్‌క్రమ్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత అఫ్గాన్ 43.3 ఓవర్లలో 208 రన్స్‌కే ఆలౌటైంది. రహ్మత్ షా (92) ఒంటరి పోరాటం చేయగా, మిగతా వారి నుంచి సహకారం అందలేదు. రబాడ 3 వికెట్లు తీశాడు. రికెల్టన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యాలు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను కట్టడి చేయడంలో అఫ్గాన్ బౌలర్లు ఫెయిలయ్యారు. దీంతో మ్యాచ్ మధ్యలో సఫారీ బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారీ స్కోరు అందించారు. ఐదో ఓవర్‌లో నబీ (2/51).. టోనీ డి జోర్జి (11)ని ఔట్ చేసి శుభారంభాన్నిచ్చినా మిగతా బౌలర్లు ఉపయోగించుకోలేదు. ఫలితంగా ఆరంభం నుంచి ఓ ఎండ్‌లో స్థిరంగా ఆడిన రికెల్టన్, బవూమ అఫ్గాన్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. గ్రౌండ్ నలుమూలల భారీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు.
ఈ క్రమంలో రికెల్టన్ 48, బవూమ 63 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. దాదాపు23 ఓవర్లు క్రీజులో నిలిచిన ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 129 రన్స్ జత చేశారు. చివరకు 29వ ఓవర్‌లో నబీ దెబ్బకు బవూమ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన డసెన్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. రెండో ఎండ్‌లో అంతే దీటుగా స్పందించిన రికెల్టన్ 103 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. కానీ 36వ ఓవర్ రికెల్టన్ అనూహ్యంగా రనౌట్ కావడంతో మూడో వికెట్‌కు 44 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో డసెన్‌తో జతకట్టిన మార్‌క్రమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ధనాధన్ షాట్లతో బౌండ్రీలు రాబట్టాడు. 41 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన డసెన్ 43వ ఓవర్‌లో వెనుదిరగడంతో నాలుగో వికెట్‌కు 47 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో మార్‌క్రమ్ జోరు పెంచినా మిల్లర్ (14) నిరాశపర్చాడు. ఐదో వికెట్‌కు 50 రన్స్ జోడించి ఔటయ్యాడు. రెండు బాల్స్ తేడాలో యాన్సెన్ (0) కూడా వికెట్ ఇచ్చాడు. చివర్లో వియాన్ ముల్డర్ (12 నాటౌట్) వేగంగా ఆడటంతో సఫారీ స్కోరు 300లు దాటింది. ఫారూకీ, అజ్మతుల్లా, నూర్ అహ్మద్ తలా ఓ వికెట్ తీశారు.
బౌలర్లు సూపర్..
భారీ ఛేదనకు దిగిన అఫ్గాన్‌ను సఫారీ బౌలర్లు సూపర్‌గా కట్టడి చేశారు. ఆరంభం నుంచే అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ముప్పు తిప్పలు పెట్టారు. ఓ ఎండ్‌లో రహ్మత్ షా ఒంటరి పోరాటం చేసినా రెండో ఎండ్‌లో చకచకా వికెట్లు తీశారు. దీంతో రహ్మనుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (17), సెదికుల్లా అటల్ (16), హష్మతుల్లా షాహిది (0) నిరాశపర్చడంతో అఫ్గాన్ 50/4తో ఎదురీత మొదలుపెట్టింది. మిడిల్‌లో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (18) కాసేపు ప్రతిఘటించడంతో ఐదో వికెట్‌కు 39 రన్స్ జతయ్యాయి.
కానీ 23వ ఓవర్‌లో రబాడ దెబ్బకు ఒమర్‌జాయ్ వెనుదిరగడంతో మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. మహ్మద్ నబీ (8), గుల్బదిన్ నైబ్ (13) ఫెయిల్ కావడంతో అఫ్గాన్ 142/7తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఫలితంగా 62 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన రహ్మత్ షాకు అండగా నిలిచే వారు కరువయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (18) నిలబడే ప్రయత్నం చేసినా సఫారీ బౌలర్లు కుదురుకోనీయలేదు. నూర్ అహ్మద్ (9), ఫజల్‌హక్ ఫారూకీ (0 నాటౌట్) నిరాశపర్చడంతో అఫ్గాన్‌కు భారీ ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా: 50 ఓవర్లలో 315/6 (రికెల్టన్ 103, మార్‌క్రమ్ 52*, నబీ 2/51). అఫ్గానిస్తాన్: 43.3 ఓవర్లలో 208 ఆలౌట్ (రహ్మత్ షా 90, రబాడ 3/36, ముల్డర్ 2/36).