అర్హులకే రైతు భరోసా.. రోడ్లు, పడావు భూములు, వెంచర్లకు రైతుబంధు ఇక బంద్

అర్హులకే రైతు భరోసా.. రోడ్లు, పడావు భూములు, వెంచర్లకు రైతుబంధు ఇక బంద్
  •      నిజమైన సాగుదారు, వాస్తవ సాగుభూమికే సాయం ఇవ్వాలని రాష్ట్ర​ సర్కారు నిర్ణయం 
  •     తాజాగా సాగుకు యోగ్యం కాని భూముల లెక్క తీస్తున్న ఆఫీసర్లు
  •     5 ఎకరాలు, పదెకరాల పరిమితిపైనా త్వరలో నిర్ణయం!

కరీంనగర్, వెలుగు: గత సర్కారు హయాంలో సాగులో లేని పడావు భూములు, గుట్టలు, ఇటుక బట్టీలు, రోడ్లు, నాన్ లే ఔట్ వెంచర్లకు ఇచ్చిన పెట్టుబడి సాయం ఇక మీదట ఆగిపోనుంది. వ్యవసాయం చేయడానికి వీల్లేని ఇలాంటి భూములకు గత సర్కారు పెట్టుబడి సాయం ఇవ్వడంపై సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్​ సర్కారు కసరత్తు చేస్తోంది. 

వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అనర్హుల లెక్క తేల్చే పనిలో పడింది. పాస్ పుస్తకాలు కలిగిన గుట్టలు, రహదారులు, కాల్వలు, ఫామ్ వెంచర్లు, నాన్ లేఔట్ ప్లాట్లు, పడావు భూములు, ఇటుక బట్టీలు, వ్యవసాయ భూముల్లో కొనసాగుతున్న పౌల్ట్రీ ఫామ్స్, ఇతర కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వ్యవసాయ భూములను ఏఓలు, ఏఈఓలు ఐడెంటిఫై చేయనున్నారు. అనంతరం అనర్హులను గుర్తించి, రైతు భరోసా డేటా నుంచి తొలగించనున్నారు.

5 శాతం భూములు పడావే 

ధరణి పోర్టల్ లో నమోదైన భూముల్లో 5 నుంచి 10 శాతం భూములు వ్యవసాయానికి యోగ్యం కాని భూములేనని తెలుస్తున్నది. వ్యవసాయ అధికారులు పక్కాగా సర్వే చేస్తే హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల చుట్టూ రెండు, మూడు దశాబ్దాల క్రితం ప్లాట్లు గా చేసిన భూములు , వెంచర్లు కలిపి సుమారు 3 లక్షల ఎకరాల వరకు తేలనున్నాయి. అలాగే గుట్టలు, రహదారులు, పడావు భూములు, అక్రమంగా పట్టా చేసిన ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూములు, ఇటుక బట్టీల లెక్క కూడా బయటపడనున్నది. ఇలాంటి భూములు కూడా మరో 2 లక్షల ఎకరాల వరకు తేలే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

రైతుభరోసా.. ఐదెకరాలా? పదెకరాలా ? 

రాష్ట్రంలో 68.99 లక్షల మంది రైతులకు 1.52 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. గత యాసంగి సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా లెక్కల ప్రకారం.. ఎకరంలోపు ఉన్న రైతులు 24,24,870 మంది ఉండగా.. వారి వద్ద 13.57 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే 2 ఎకరాల్లోపు ఉన్న రైతులు 17,72,675 మంది ఉండగా.. వారి వద్ద 26.58 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తంగా ఐదెకరాల్లోపు ఉన్న రైతులు రాష్ట్రంలో 64,75,320 మంది ఉండగా, వారి వద్ద 1,11,49,534 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 

వాస్తవానికి గత వానాకాలం సీజన్ లో ఐదెకరాల్లోపు ఉన్న రైతులు 62 లక్షల మంది ఉండగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. కానీ గత కొద్ది నెలల్లోనే ఐదెకరాల్లోపు ఉన్న రైతులు సుమారు 2 లక్షల మంది పెరిగారు. ఐదెకరాల్లోపు ఉన్న రైతుల చేతిలో భూమి కూడా మరో 10 లక్షల ఎకరాల మేర పెరగడం విశేషం. రైతుభరోసాపై పరిమితి విధిస్తారనే ప్రచారం నేపథ్యంలోనే పదెకరాలకుపైగా ఉన్న రైతులు తమ కుటుంబ సభ్యుల పేరిట ఐదెకరాల చొప్పున ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది.

 ప్రస్తుతం 4 లక్షల మంది వద్ద సుమారు 40 లక్షల ఎకరాల భూమి ఉంది. రైతు బంధును ఐదెకరాలకే పరిమితం చేస్తారా? లేదా పదెకరాలలోపు వారికి అమలు చేస్తారా? అనేది త్వరలోనే తేలనుంది. 

సంపన్నులకు రైతు భరోసా కట్!

గత సర్కార్ హయాంలో వ్యవసాయ భూములు కలిగి ఉన్న కోటీశ్వరులైన బడా కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ఉన్నతాధికారులకు రైతుబంధు అందిన విషయం తెలిసిందే. ఎలాంటి నిబంధనలు విధించకుండా, లిమిట్ పెట్టకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందిం చడంతో ఈ స్కీమ్ అభాసుపాలైంది. 

అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మొదటి బడ్జెట్ సమావేశా ల్లోనే వందల ఎకరాలు ఉన్న భూస్వాములు, సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వొద్దని నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజమైన సాగుదారుకే, వాస్తవ సాగుభూమికే రైతు భరోసా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.