ప్రతి ఇంట్లో పెద్దల ఫొటోలు ఉంటాయి.. అయితే వాటిని పెట్టేందుకు కూడా వాస్తును పాటించాలి. అలాగే వాయువ్యం పెరిగినా.. పూర్తిగా క్లోజ్ అయినా.. ఇంటి ప్రహరీ గోడలపై మొక్కల కుండీలు ఉండవచ్చా.. వాస్తు ప్రకారం పాటించాల్సిన పద్దతులు ఏంటి.. వాస్తుకన్సల్టెంట్ శ్రీనివాస్ ఈ విషయాలపై ఏమంటున్నారు.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. .
ప్రశ్న: ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫొటోలు పెట్టుకోవచ్చా? అలా పెట్టుకుంటే నెగెటివ్ ఆలోచనలు వస్తాయని కొంతమంది చెప్పారు. ఇది ఎంతవరకు నిజం.
జవాబు: చనిపోయిన వాళ్లను దేవుళ్లతో సమానంగా భావిస్తాం. ఆత్మీయుల ఫొటోలు ఇంట్లో పెట్టుకోవడం శుభసూచకమే. పెద్దల ఆశీర్వాదం ఉంటుందని అలా పెట్టుకుంటారు. ఫొటోలను పూజ గదిలో పెట్టకూడదు. ఇంటి ముఖద్వారానికి ఎదురుగా పెట్టుకోవచ్చు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే దక్షిణం, లేదంటే పడమర దిక్కులో ఫొటోలు పెట్టాలి.
ప్రశ్న:వాయువ్యం పెరిగినా, మూతపడినా, ఇంకేమైనా వాయువ్య దోషాలు ఉన్నా... వాటి నివారణకు ఏం చేయాలి?
జవాబు: వాయువ్య దోషాలు ఉండటం అంత మంచిది కాదు. దాని వల్ల ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు వస్తాయి. వాయువ్యం పెరిగితే... దాని కట్ చేసి విడగొట్టాలి. ఇంట్లో అలాంటి దోషం ఉంటే.. కొంత గ్యాప్ ఇచ్చి కట్టుకోవాలి. అపార్ట్ మెంట్ అయితే పూర్తిగా సెపరేట్ చేసి సమాంతరంగా నిర్మాణం చేసుకోవాలి.
ప్రశ్న: మేము ఈ మధ్యనే ఇల్లుకట్టుకొని గృహప్రవేశం చేశాం. వాస్తు ప్రకారమే ఇంటిని కట్టుకున్నాం. తూర్పు,ఉత్తర ప్రహరీ గోడలపై పూల చెట్లు పెంచొచ్చా? దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
జవాబు: కొంతమంది ఊళ్లలో ప్రహరీ గోడలపై పూల మొక్కలు పెంచుతుంటారు. దాని వల్ల వాస్తు సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే పూల చెట్ల బరువు ఎక్కువ ఉండకూడదు. అయితే గోడపై ఉండే మొక్కలకు నీరు పెట్టడం వల్ల గోడకు నిమ్ము వస్తుంది. దాంతో గోడలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది
