ఆపరేషన్ సిందూర్‎లో S-400 ఓ గేమ్చేంజర్: ఎయిర్‌‌‌‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్

ఆపరేషన్ సిందూర్‎లో S-400 ఓ గేమ్చేంజర్: ఎయిర్‌‌‌‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్

న్యూఢిల్లీ: ఆపరేషన్​ సిందూర్​ సమయంలో పాక్‌‌‌‌కు చెందిన 6  ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లను మన సైన్యం కూల్చేసిందని ఇండియన్ ఎయిర్‌‌‌‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. కర్నాటకలోని బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఏపీ సింగ్​మాట్లాడారు. మన సైన్యం జరిపిన మెరుపు దాడులతో శత్రు సేనల స్థావరాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. 

‘‘మన సైన్యం దాడిలో పాక్‌‌‌‌కు చెందిన 5 ఫైటర్ ​జెట్స్ కూలిపోయాయి. ఓ పెద్ద విమానాన్ని కూడా సైన్యం ధ్వంసం చేసింది. ఆ విమానం ఎలింట్​లేదా ఏఈడబ్ల్యూ అండ్​సీ ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్​కావొచ్చు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానిపై భూతలం పైనుంచే దాడి చేశారు. భూఉపరితలం నుంచి గగనతలంలోకి ఇప్పటివరకూ జరిపిన అతిపెద్ద దాడి ఇదే” అని పేర్కొన్నారు. మే 7న పాక్‌‌‌‌పై దాడికి సంబంధించిన శాటిలైట్​చిత్రాలను ప్రదర్శించారు. కాగా, ఆపరేషన్ సిందూర్​తర్వాత పాకిస్తాన్‌‌‌‌కు జరిగిన నష్టాన్ని భారత్​మొదటిసారి ప్రకటించింది.    

ఎస్​400 ఓ గేమ్ ​చేంజర్​

భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక సంఘర్షణ ‘హైటెక్ యుద్ధం’ అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్నారు. సుమారు 80–-90 గంటల్లోనే టార్గెట్‌‌‌‌ను ఛేదించినట్టు చెప్పారు. ‘‘మన ఎయిర్​డిఫెన్స్​సిస్టమ్స్​అద్భుతంగా పనిచేశాయి. ఎస్​- 400 వ్యవస్థ గేమ్- చేంజర్‌‌‌‌గా నిలిచింది. పాకిస్తాన్​ ప్రయోగించిన లాంగ్​రేంజ్​గ్లైడ్​బాంబులు కూడా మన రక్షణ వ్యవస్థను ఛేదించలేకపోయాయి” అని తెలిపారు. 

యుద్ధం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించక తప్పదని భావించిన పాక్.. మనతో కాళ్లబేరానికి వచ్చిందని చెప్పారు. దాడులను ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందుకు రాజకీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ సంకల్పంతోనే ఈ ఆపరేషన్‌‌‌‌లో విజయం సాధించినట్టు తెలిపారు. తమకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని చెప్పారు.  

వెన్నెముకగా స్వదేశీ టెక్నాలజీ

ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌లో సైన్యం పరాక్రమమే కాదు.. స్వదేశీ టెక్నాలజీ కూడా వెన్నెముకగా నిలిచిందని డీఆర్డీవో చైర్మన్ సమీర్​కామత్​ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్​స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తనను తాను రక్షించుకోవడంతోపాటు.. దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం కళ్లకు కట్టిందని వెల్లడించారు. 

మహారాష్ట్రలోని పుణెలో జరిగిన డిఫెన్స్​ఇన్‌‌‌‌స్టిట్యూట్​ ఆఫ్​ అడ్వాన్స్‌‌‌‌డ్​టెక్నాలజీ (డీఐఏటీ) 4వ కాన్వొకేషన్ వేడుకలో సమీర్​కామత్​ పాల్గొని, మాట్లాడారు. రష్యాతో కలిసి భారత్​అభివృద్ధి చేసిన బ్రహ్మోస్​క్రూయిజ్ క్షిపణి భయంకరమైన శక్తిని ప్రదర్శించి, పాకిస్తాన్‌‌‌‌లోని అనేక లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని వెల్లడించారు.

ఒక్కటి కూడా కూలలే: పాక్  రక్షణ మంత్రి

భారత సైన్యం దాడుల్లో తమ యుద్ధ విమానం ఒక్కటి కూడా కూలలేదని పాక్​ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. 3 నెలలు మౌనంగా ఉండి  ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.