బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో జైశంకర్‌

బీజేపీ కీలక  నిర్ణయం..  రాజ్యసభ బరిలో జైశంకర్‌

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలక  నిర్ణయం తీసుకుంది.  గుజరాత్ తో పాటుగా బెంగాల్, గోవా రాష్ట్రాల్లో జరగబోయే మొత్తం 10 రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా గుజరాత్‌లో మూడు స్థానాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ లోని ఒక స్థానం నుంచి ప్రస్తుత కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ పేరును ఖరారు చేసింది.  

2023 జూలై 10 న జైశంకర్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మిగిలిన రెండు చోట్ల నుంచి అభ్యర్థులను రేపు ఖరారు చేయనుంది.   జైశంకర్‌ రాజ్యసభ పదవీకాలం ఆగస్టుతో ముగుస్తుంది. జైశంకర్‌తో పాటు గుజరాత్‌కు చెందిన దినేష్ జెమల్‌భాయ్ అనవాదియా, లోఖండ్‌వాలా జుగల్ సింగ్‌ల పదవీకాలం కూడా ఆగస్టు 18తోనే  ముగియనుంది. 

మరోవైపు గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో తమకు పెద్దగా సీట్లు లేనందున ఈసారి ఎన్నికల్లో పాల్గొనబోమని కాంగ్రెస్‌ ప్రకటించింది. గుజరాత్ తో పాటుగా వెస్ట్ బెంగాల్ లో ,గోవా  రాష్ట్రాల్లో కలిపి మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 2023 జూలై 13 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఎవరైనా తమ  పేరును ఉపసంహరించుకోవాలనుకుంటే, జూలై 17 వరకు టైమ్ ఉంటుంది. 2023  జూలై 24న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు.