ముగిసిన అయ్యప్ప దర్శనం... శబరిమల ఆలయం మూసివేత

ముగిసిన అయ్యప్ప దర్శనం... శబరిమల ఆలయం మూసివేత

అయ్యప్ప భక్తులకు (ayyappa) అలర్ట్ . శబరిమల ఆలయాన్ని (Sabarimala Temple)  మూసివేశారు. ఇప్పటికే దర్శనాలు ముగియడంతో ఈరోజు ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం శబరి ఆలయాన్ని (Sabarimala Temple) మూసివేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. 

శరణుగోషతో మారుమోగిన శబరికొండలు మూగబోయాయి. ఆదివారం ( జనవరి 21) తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా.. అదే స్థాయిలో ఆదాయం చేకూరింది. ఈ ఏడాదికి(2024) గాను మండల, మకరవిలక్కు పూజలు సమాప్తం అయ్యాయి. జనవరి 21 ఉదయం 5.30సమయంలో ప్రత్యేకపూజలు చేసి ఆపై అయ్యప్ప ఆలయం మూసివేశారు అధికారులు.

శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తులు పోటెత్తారు. రోజుకు సుమారు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. తక్కువలో తక్కువగా సుమారు 15 గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్పలు. ఈ ఏడాది 50 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు తెలిపింది. గత ఏడాది ఈ సంఖ్య 44 లక్షలుగా ఉండగా.. టోకెన్లు, స్లాట్‌ సిస్టమ్, ఆంక్షలున్నా గతేడాదికంటే 6లక్షల మంది అదనం వచ్చినట్లు చెప్పారు అధికారులు. 41 రోజుల పాటు సాగిన మండల-మకరవిళక్కు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయాన్నిమూసివేశారు. అయితే శబరిమలలో పోటెత్తిన భక్తుల రద్దీతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు.

 ఈ ఏడాది 357 కోట్ల 47లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది ట్రావెన్‌కోర్‌. గతేడాదితో పోల్చితే దాదాపు పదికోట్లు అదనపు ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చినట్లు చెప్పారు అధికారులు. సీజన్‌కు 7 నెలల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించినట్లు TDB తెలిపింది. స్వార్థ ప్రయోజనాలతో కొందరు పాదయాత్రకు సంబంధించి తప్పుడు సమాచారం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే పాదయాత్ర సజావుగా సాగిందన్నారు. జనవరి 15న మకరవిళక్కు ఉత్సవం.. శుక్రవారం మలికప్పురం ఆలయంలో గురుతి నిర్వహించారు.

ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భక్తులు శబరిమలకు వచ్చారు. ప్రధానంగా నవంబర్, డిసెంబర్ నెలలో శబరిమల (Sabarimala Temple) భక్తులతో కిటకిటలాడింది. దర్శనానికి 24 గంటల సమయం కూడా పట్టిన రోజులు ఉన్నాయి. రహదారులపై అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరకు కేరళ హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శబరిమలలో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా సరైన వసతులు సమకూర్చలేదని అనేకమంది దేవస్థానం కమిటీపై మండిపడ్డారు. దీంతో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడతామని ప్రకటించింది.