- ఉన్నికృష్ణన్ ఇంట్లో బంగారు నాణేలతోపాటు 2 లక్షల నగదు సీజ్
తిరువనంతపురం: శబరిమల ఆలయ బంగారం దొంగతనం కేసులో సిట్ అధికారులు భారీ పురోగతిని సాధించారు. కర్నాటకలోని బళ్లారిలో గల ఒక జ్యువెలరీ షాపు నుంచి సుమారు 400 గ్రాముల బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పోట్టి తన సహచరుడు, గోల్డ్ షాపు ఓనర్ గోవర్ధన్‌కు అప్పగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక, తిరువనంతపురంలోని పులిమత్ ప్రాంతంలో ఉన్న ఉన్నికృష్ణన్ పోట్టి ఇంటిలో సోదాలు చేసిన సిట్అధికారులు కొన్ని బంగారు నాణేలతోపాటు రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉన్నికృష్ణన్ కస్టడీని కోర్టు అక్టోబర్ 30 వరకు పొడిగించింది. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. అందులో భాగంగా దర్యాప్తు బృందాలు బెంగళూరు, బళ్లారి, హైదరాబాద్, చెన్నై నగరాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి.
బెంగళూరులోని ఉన్నికృష్ణన్ నివాసం, బళ్లారిలో బంగారం అమ్మిన షాపు, హైదరాబాద్‌లో ఆలయ గర్భగుడి తలుపు ప్యానెల్స్‌కు మరమ్మతులు చేసిన సంస్థ, చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ (గోల్డ్ ప్లేటింగ్ సరఫరాదారులు)లోనూ సోదాలు చేశారు. ప్రస్తుతం బళ్లారిలో స్వాధీనం చేసుకున్న బంగారం శబరిమల ఆలయ పనుల కోసం తీసుకొచ్చిందేనా కాదా అనే అంశాన్ని సిట్అధికారులు పరిశీలిస్తున్నారు. గోవర్ధన్ గతంలో ఆలయ గర్భగుడి ప్యానెల్స్ బంగారు పూత పనులకు గోల్డ్ సరఫరా చేసిన వ్యక్తి కావడంతో అతడిపైనా విచారణ కొనసాగుతోంది. ట్రావెన్కోర్ దేవోస్వం బోర్డు ఉద్యోగులను కూడా విచారణకు పిలుస్తామని అధికారులు చెబుతున్నారు.
