- శబరిమల యాత్రకు భారత్ గౌరవ్ టూరిస్టు రైలు
సికింద్రాబాద్, వెలుగు: అయ్యప్ప భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో ఆధ్యాత్మిక టూరిజం వృద్ధికి భారత్ గౌరవ్ రైళ్లు పెద్దపీట వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
శబరిమల యాత్రకు ఐఆర్ సీటీసీ నూతన ప్యాకేజీ
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభం కానున్న ఐఆర్ సీటీసీ ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ శబరిమల యాత్ర పేరుతో నూతన ప్యాకేజీని ప్రకటించింది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా నడవనుంది. సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైలు ఎక్కేందుకు చాన్స్ కల్పించారు. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం, ఎర్నాకుళం చోటానిక్కర్ అమ్మవారి ఆలయాలను కవర్ చేస్తూ సాగే ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రుళ్లు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైలులో మొత్తంగా 716 సీట్లు (స్లీపర్ 460, థర్డ్ ఏసీ 206, సెకండ్ ఏసీ 50 సీట్లు చొప్పున) ఉన్నాయి.