బంగారం చోరీ కేసులో ట్విస్ట్.. శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్‌‌

బంగారం చోరీ కేసులో ట్విస్ట్.. శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్‌‌
  • 11కు చేరిన నిందితుల సంఖ్య

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయానికి సంబంధించిన బంగారు తాపడాల(గోల్డ్ ప్లేటెడ్ ప్యానెల్స్) చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి(తంత్రి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన 11వ వ్యక్తిగా రాజీవరు పేరు నమోదైంది.

బంగారు తాపడాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్‌‌కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా రాజీవరును అదుపులోకి తీసుకున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆలయానికి ఉన్నికృష్ణన్ ను తీసుకొచ్చిందే రాజీవరని తేలినట్లు చెప్పారు.

ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను ఆలయ ప్రాంగణంలోనే మరమ్మతు చేయాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా,  వాటిని చెన్నైకి తీసుకెళ్లడానికి రాజీవరు అనుమతిచ్చారని వివరించింది. బంగారు తాపడాల చోరీ కేసులో రాజీవరు పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతోనే ఆయనను అరెస్టు చేసినట్లు సిట్ తెలిపింది. రిమాండ్ ప్రక్రియల్లో భాగంగా రాజీవరును విజిలెన్స్ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొంది. 

అసలేం జరిగిందంటే..!

శబరిమలలో  గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల కోసమని తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్ని కృష్ణన్‌‌ అనే దాత సమక్షంలో చెన్నైకి పంపారు. మరమ్మతుల తర్వాత ఆ తాపడాల బరువు తగ్గిందని..సుమారు 4.5 కిలోలకుపైగా బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.

కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు చేపట్టగా, ఇప్పటివరకు 10 మంది అరెస్టయ్యారు. తాజాగా రాజీవరు అరెస్ట్ తో ఆ సంఖ్య 11కు చేరింది. ఈ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది.