- వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత
- ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్‌గా హిస్టరీ
- విమెన్స్ సెక్షన్లో రన్నరప్‌గా హంపి
టొరాంటో: ఇండియా యంగ్‌స్టర్, 17 ఏండ్ల చెన్నై కుర్రాడు దొమ్మరాజు గుకేశ్ కొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ బెస్ట్ ప్లేయర్లను మట్టి కరిపిస్తూ ప్రతిష్టాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ ఫైట్‌కు క్వాలిఫై అయిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. లెజెండరీ ప్లేయర్ గ్యారీ కాస్పరోవ్ 40 ఏండ్ల కిందట సృష్టించిన రికార్డును బద్దలు కొట్టాడు. క్యాండిడేట్స్ టోర్నీలో స్టార్టింగ్ నుంచే సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న గుకేశ్.. ఆదివారం అర్ధరాత్రి జరిగిన 14వ, ఫైనల్ రౌండ్లో అమెరికా స్టార్ హికారు నకామురాతో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
దాంతో 14 పాయింట్లకు గాను 9 పాయింట్లు సాధించి టోర్నీ విజేతగా నిలిచాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ ఫైట్‌లో డిఫెండింగ్ చాంప్ డింగ్ లిరెన్ (చైనా)తో గుకేశ్ పోటీపడనున్నాడు. కాస్పరోవ్ 1984లో 22 ఏండ్ల వయసులో వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ ఫైట్ (అనాటోలీ కార్పోవ్‌తో) లో పాల్గొన్న యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని ఈ రికార్డును బ్రేక్ చేసిన గుకేశ్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్నాడు. క్యాండిడేట్స్ టైటిల్‌తో పాటు 88, 500 యూరోలు (రూ. 78.5 లక్షలు) నగదు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ (2014) తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన రెండో ఇండియన్ గుకేశ్ కావడం గమనార్హం.
నల్లపావులతో ఆడినా
13వ రౌండ్లో ఫ్రాన్స్ ఆటగాడు ఫిరౌజ అలీరెజాను ఓడించి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చిన గుకేశ్ టాప్ ప్లేస్ నిలబెట్టుకునేందుకు ఆఖరి రౌండ్లో కనీసం డ్రా అవసరం అయింది. నకామురాతో ఆఖరాటలో నల్లపావులతో బరిలోకి దిగినప్పటికీ ఇండియా కుర్రాడు ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. క్వీన్స్ గ్యాంబిట్ గేమ్‌తో ఆటను షురూ చేసిన ఇరువురూ ఏ దశలోనూ విజయం కోసం తలపడినట్టు కనిపించలేదు. చివరకు 71 ఎత్తుల వద్ద డ్రాకు అంగీకరించడంతో గుకేశ్ ఖాతాలో మొత్తం 9 పాయింట్లు చేరాయి.
దాంతో చెరో 8 పాయింట్లతో ఉన్న అమెరికన్ కరువానా, రష్యా స్టార్ ఇయాన్ నెపోమ్నియాచి గేమ్‌పై అందరి దృష్టి నిలిచింది. వీళ్లలో ఎవ్వరు నెగ్గినా గుకేశ్ టై బ్రేక్ ఆడాల్సి వచ్చేది. అయితే, స్టార్టింగ్‌లో దూకుడుగా ఆడిన కరువానా తర్వాత తడబడి డ్రా చేసుకున్నాడు. దాంతో ఇద్దరూ 8.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా టాప్ ప్లేస్‌తో గుకేశ్‌ను టైటిల్ వరించింది. ఇండియాకే చెందిన మరో యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఆఖరి గేమ్‌లో నిజత్ అబసోవ్ (అజర్బైజాన్)ను ఓడించి 7 పాయింట్లతో ఐదో స్థానం సాధించాడు. ఫిరౌజా అలీరెజా (ఫ్రాన్స్)తో గేమ్‌ను డ్రా చేసుకున్న విదిత్ సంతోష్ గుజరాతీ 6 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టాడు.
ఆ ఓటమి కసి పెంచింది
నా జీవితంలో ఇది అపురూపమైన క్షణం. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు క్వాలిఫై అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ టోర్నీ స్టార్టింగ్ నుంచి నేను బాగానే ఆడాను. కానీ, ఏడో రౌండ్లో అలీరెజా చేతిలో ఓటమి తర్వాత చాలా బాధపడ్డా. ఆ ఓటమి నాలో గెలవాలన్న కసిని, ప్రేరణను పెంచింది. నేను సరైన దారిలో వెళ్తే, మానసికంగా బలంగా ఉంటే కచ్చితంగా గెలుస్తానని భావించా. మూడు వారాలుగా చాలా ఒత్తిడి ఎదుర్కొన్నాను కాబట్టి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం ప్లాన్ చేస్తా. ఆ టోర్నీలోనూ నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. -
గుకేశ్
హంపి అదుర్స్
ఇండియా లెజెండరీ ప్లేయర్, ఏపీకి చెందిన కోనేరు హంపి విమెన్స్ క్యాండిడేట్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. టోర్నీలో పడుతూ లేస్తూ ముందుకు సాగిన హంపి చివర్లో మాత్రం తన మార్కు చూపెట్టింది. ఆఖరి రౌండ్లో చైనాకు చెందిన టింగ్జీ లీని ఓడించింది. 7.5 పాయింట్లతో సూపర్ టై బ్రేక్‌తో రెండో స్థానంతో రన్నరప్‌గా నిలిచింది. 9 పాయింట్లతో లీ టైటిల్ నెగ్గింది. మరోవైపు ఆర్. వైశాలి వరుసగా ఐదో విజయంతో ఆకట్టుకుంది. ఆఖరి రౌండ్లో తను రష్యాకు చెందిన క్యాథెరినా లాంగోను ఓడించింది. వైశాలి కూడా 7.5 పాయింట్లు సాధించినా టై బ్రేక్ తర్వాత ఐదో స్థానంలో నిలిచింది.
చదరంగంలో చిరుత
చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్‌ను చూసి ఏడేండ్ల వయసులో ఆటపై ఆసక్తి పెంచుకొని.. శిక్షణ తీసుకున్న ఆరు నెలల్లోనే ఫిడే రేటింగ్ సాధించిన గుకేశ్ ఇండియా చెస్ అడ్డా చెన్నై నుంచి వచ్చిన చిచ్చరపిడుగుల్లో ఒకడు. చిత్తూరు నుంచి చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో పుట్టిన ఈ కుర్రాడు చదరంగంలో చిరుతలా దూసుకెళ్తున్నాడు. అతడి తండ్రి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్ కాగా తండ్రి పద్మ మైక్రోబయోలజిస్ట్. వాళ్ల ప్రోత్సాహంతో స్కూల్ కోచ్ భాస్కర్ వద్ద ఆటలో ఓనమాలు నేర్చుకున్న గుకేశ్ అనతికాలంలోనే అద్భుతాలు సృష్టించాడు.
2015లో అండర్ –-9 ఆసియా స్కూల్ చెస్, 2018లో అండర్12 వరల్డ్ యూత్ చెస్ టైటిల్ నెగ్గాడు. ఆటలో కొడుకు ఆసక్తిని, ప్రతిభను చూసిన గుకేశ్ పేరెంట్స్ అతని కోసం ఎన్నో త్యాగాలు చేశారు. తండ్రి ఏడాది పాటు వైద్య వృత్తిని పక్కనబెట్టి గుకేశ్‌ను దేశ విదేశాల్లోని టోర్నీలకు తీసుకెళ్లాడు. తల్లి ఇంటితో పాటు వారి ఖర్చులు సమకూర్చింది. వాళ్ల కష్టాన్ని గుకేశ్ వృథా పోనీయలేదు. 2019లో జనవరిలో 12 ఏండ్ల ఏడు నెలల, 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకొని ఈ ఘనత సాధించి రెండో పిన్నవయస్కుడిగా రికార్డు లకెక్కాడు. అక్కడి నుంచి అతని ఎత్తులు పైస్థాయికి చేరుకున్నాయి. వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో విశ్వనాథన్ మార్గనిర్దేశంలో మరింత రాటు దేలాడు.
2750 ఎలో రేటింగ్ అందుకున్న అతను ఆనంద్‌ను వెనక్కు నెట్టి 37 ఏండ్ల తర్వాత ఇండియా నంబర్. 1ర్యాంక్ అందుకున్నాడు. అంతేకాదు నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించిన యంగెస్ట్ ప్లేయర్‌గానూ రికార్డు కెక్కాడు. గతేడాది ఓ టోర్నీలో ఆనంద్‌ను రెండుసార్లు ఓడించాడు. క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ టోర్నీలో గుకేశ్‌తో పాటు ప్రజ్ఞానంద, విదిత్ కూడా పోటీపడ్డారు. ఇండియా నుంచి అందరి ఫోకస్ ప్రజ్ఞానందపై ఉండగా అంచనాలను తలకిందలు చేస్తూ గుకేశ్ టైటిల్ నెగ్గాడు. తను ఇదే జోరు కొనసాగించి వరల్డ్ చెస్ ఫైట్‌లో డింగ్ లిరెన్‌ను ఓడిస్తే చెస్ హిస్టరీలో యంగెస్ట్ వరల్డ్ చాంపియన్‌గా నిలుస్తాడు.
ఫిడే క్యాండిడేట్స్ చెస్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్ నిలిచినందుకు దేశం ఎంతో గర్విస్తోంది. ఈ టోర్నీలో గుకేశ్ అద్భుత విజయం అతని అసాధారణ ప్రతిభ, అంకితభావానికి నిదర్శనం. గుకేశ్ ఆట, అతని ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంది.
- ప్రధాని నరేంద్ర మోదీ
యంగెస్ట్ చాలెంజర్‌గా మారిన గుకేశ్‌కు అభినందనలు. నువ్వు సాధించిన ఘనత పట్ల వాకా చెస్ (వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ) కుటుంబం చాలా గర్వపడుతోంది. ఈ టోర్నీలో నీ ఆట, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తీరును చూసి వ్యక్తిగతంగా నేను కూడా చాలా గర్వపడుతున్నా. ఈ క్షణాన్ని అస్వాదించు గుకేశ్.
- విశ్వనాథన్ ఆనంద్