కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ
  •  మంత్రి సబితా రెడ్డి

కందుకూరు/వికారాబాద్ /శంకర్​పల్లి, వెలుగు:  రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  రైతులకు 3 గంటల విద్యుత్ చాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు గేట్ వద్ద  బీఆర్ఎస్​నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సబిత మాట్లాడుతూ...   రైతులకు 24  గంటల ఉచిత విద్యుత్ వద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని తేలిపోయిందన్నారు.  

బోర్ల వద్ద మోటార్లు బిగిస్తామని బీజేపీ అంటోందని, కాంగ్రెస్ ధరణిని రద్దు చేస్తామని చెబుతోందని.. ఇలాంటి నిర్ణయాలతో  రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆమె అన్నారు.  రైతు వ్యతిరేక కాంగ్రెస్, బీజేపీలను నమ్మొదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి పాల్గొన్నారు. పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య డిమాండ్ చేశారు. శంకర్​పల్లి చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి, నవాబ్ పేట, మర్పల్లి, ధారూర్ మండలాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపట్టారు.