కేంద్రం మరో యాక్షన్ ప్లాన్: అమల్లోకి ‘సబ్ కీ యోజన.. సబ్ కీ వికాస్’

కేంద్రం మరో యాక్షన్ ప్లాన్: అమల్లోకి ‘సబ్ కీ యోజన.. సబ్ కీ వికాస్’

‘సబ్ కీ యోజన.. సబ్ కీ వికాస్’ అమల్లోకి తెచ్చిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: గ్రామాల సమగ్రాభివృద్ధికి పంచాయతీ యాక్షన్​ ప్లాన్​ తరహాలో కేంద్ర ప్రభుత్వం మరో ప్లాన్ తీసుకొచ్చింది. ‘సబ్ కీ యోజన.. సబ్ కీ వికాస్’పేరుతో అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2020–21 కల్లా గ్రామాలు అన్ని సౌకర్యాలతో పురోగతి సాధించాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31లోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టి సమస్యలు గుర్తించి, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) రూపొందించాలని గైడ్ లైన్స్ లో పేర్కొంది. ఈ కార్యక్రమం అమలుపై త్వరలో డీపీవోలు, ఎంపీడీవోలతో జిల్లాల కలెక్టర్లు సమావేశం కానున్నారు.

యాక్షన్ ప్లాన్ తరహాలో ఈ కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఇటీవల 30 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టింది. పచ్చదనం, పరిశుభ్రత, బావులు పూడ్చటం వంటి కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. ఇదే తరహాలో కేంద్రం తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వకుండా ఆర్థిక సంఘం నిధులనే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కార్యక్రమం అమలు సులువు అవుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ‘సబ్ కీ యోజన.. సబ్ కీ వికాస్’ అమలుకు ప్రతి జిల్లాకు ఓ నోడల్ ఆఫీసర్ ను నియమించాలని డీపీవోలందరికీ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో అమలు ఆలస్యం

14వ ఆర్థిక సంఘం కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఏప్రిల్ నుంచి 15వ ఆర్థిక సంఘం ప్రారంభమవుతుంది. పంచాయతీలకు నిధుల విడుదలలో ఈ ప్లాన్ ను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించాలని ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ అక్టోబర్ 17న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు జిల్లాలకు ఉత్తర్వులు పంపారు. రెండు రోజుల క్రితం డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ లకు ఫోన్ చేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని సూచించారు. అన్ని చోట్లా ప్రారంభం కావటానికి మరో వారం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి.