- విచారణ స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయం ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది. సచిన్‌పైలెట్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24 వరకు 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ స్పీకర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారించిన కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సచిన్ పైలెట్ వర్గానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. హైకోర్టు ఆదేశాలు అమలు మాత్రం సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుందని కేసు విచారించిన జస్టిస్ అరుణ్‌మిశ్రా చెప్పారు. అంతే కాకుండా సుప్రీం కోర్టులో స్పీకర్ లెవనెత్తిన అంశాలపై విచారణ చేపడతామని, ఈ మేరకు ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది. అసమ్మతి స్వరాన్ని ఎవరు అణిచివేయలేరని, ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదా అని అరుణ్‌మిశ్రా ప్రశ్నించారు. రాజస్థాన్ హైకోర్టులోని కేసును సుప్రీం కోర్టుల బదిలీ చేయాలని స్పీకర్ తరఫు లాయర్ కపిల్ సిబల్ కోరగా కోర్టు దానికి నిరాకరించింది. దానిపై ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది.
