
న్యూఢిల్లీ: లెజెండరీ ప్లేయర్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ టీమ్‌లో ఉన్నా.. సచిన్ టెండూల్కర్ ఫేవరెట్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ అని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. 1999–2000 ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా లక్ష్మణ్ గురించి మాస్టర్ మాట్లాడిన మాటలను ‘సచిన్ @ 50, సెలబ్రేటింగ్ ఏ మ్యాస్ట్రో’ పేరుతో వస్తున్న కొత్త బుక్‌లో ఎమ్మెస్కే వివరించాడు. సోమవారం సచిన్ 50వ పడిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ బుక్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఆ టూర్‌లో తమ ముగ్గురి మధ్య జరిగిన ఓ సంభాషణను ఎమ్మెస్కే వెల్లడించాడు. ‘నీలో చాలా టాలెంట్ ఉంది. నా కంటే ఓ సెకన్ ముందుగానే నీవు బంతిని చూడగలవు. నీవు అర్థం చేసుకోలేని అసాధారణమైన టాలెంట్‌ను దేవుడు ఇచ్చాడు. నీలా కాకుండా నాకు మినిమమ్ టాలెంట్ ఇచ్చాడు. కాకపోతే దాన్ని నేను పెంచుకున్నా. నా బ్యాటింగ్‌లో నాలుగు గేర్లే ఉన్నాయి. డిఫెన్స్, పుష్, డ్రైవ్, ల్యాఫ్ట్. నేను పరిస్థితులకు తగినట్లుగా నా లాజిక్‌ను ఉపయోగిస్తా. దానికి అనుగుణంగా నా పెర్ఫామెన్స్ ఉంటుంది. కానీ నీవు క్లిష్ట పరిస్థితుల్లోనూ డైరెక్ట్‌గా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. పరిస్థితుల గురించి ఆలోచించొద్దు. వాటిని అధిగమిస్తే నీవు లెజెండ్‌వి అవుతావు’ అని ఎమ్మెస్కే గుర్తు చేశాడు.