గురువే దైవం.. ఆచ్రేకర్ స్మారకానికి నివాళులర్పించిన సచిన్.. నెట్టింట వీడియో వైరల్!

గురువే దైవం.. ఆచ్రేకర్ స్మారకానికి నివాళులర్పించిన సచిన్.. నెట్టింట వీడియో వైరల్!

Sachin Tendulkar: క్రికెట్ దేవుడిగా ఫ్యాన్స్ పూజించే భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురు పౌర్ణమి సందర్భంగా తన చిన్ననాటి కోచ్, దివంగత రమాకాంత్ అచ్రేకర్ జ్ఞాపకాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ దగ్గర ఉన్న అచ్రేకర్ స్మారక చిహ్నాన్ని సచిన్ సందర్శించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్మారకం చిత్రాలను షేర్ చేస్తూ, ఇక్కడ నిలబడి ఆలోచిస్తుంటే ఒక విషయం అర్థమైంది.. ఎన్నేళ్లు గడిచినా, మీకు చెప్పడానికి నా దగ్గర ఇంకో థాంక్యూ పదం మిగిలే ఉంటుంది.. నాపై నమ్మకం ఉంచి, సరైన మార్గదర్శకత్వంలో ముందుకు నడిపించినందుకు ధన్యవాదాలు సర్.. హ్యాపీ గురు పౌర్ణమి, అచ్రేకర్ సర్! అంటూ సచిన్ కృతజ్ఞతలు తెలిపారు.  

ఏకాంతంలో గురువుకు నివాళి: 
శివాజీ పార్క్‌లోని అచ్రేకర్ స్మారకం వద్ద సచిన్ టెండూల్కర్ సమర్పించిన నివాళి అభిమానుల హృదయాలను హత్తుకుంది. పగటిపూట వచ్చే జనసందోహాన్ని, ఫ్యాన్స్ తాకిడిని నివారించేందుకు సచిన్ రాత్రి వేళల్లో ఒంటరిగా అక్కడకు వెళ్లారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, ఎంతో వినయంతో, చేతులు జోడించి నమస్కరిస్తూ గురువు స్మారకం దగ్గర గులాబీ పూలను ఉంచారు. గ్రౌండ్ లో ఎంతటి దిగ్గజ స్థాయికి ఎదిగినా తన మూలాలను, గురువును మరువని సచిన్ నైజానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలిచాయి. కాగా, ఈ స్మారక చిహ్నాన్ని 2024లో ఎంఎన్ఎస్ (MNS) అధినేత రాజ్ ఠాక్రేతో కలిసి సచిన్ స్వయంగా ప్రారంభించారు.

►ALSO READ | ఇక పోరాడలేను అంటూ వీడ్కోలు.. నెయ్మార్ రిటైర్మెంట్‌తో బ్రెజిల్ ఫ్యాన్స్ ఎమోషనల్

భారత క్రికెట్‌కు మాస్టర్ ను అందించిన ద్రోణాచార్య: 
సచిన్ టెండూల్కర్ సాధించిన అపారమైన విజయాల వెనుక అచ్రేకర్ ఇచ్చిన కఠిన శిక్షణే ప్రధాన కారణం. మైదానంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనేలా అచ్రేకర్ సర్ తనను సిద్ధం చేశారని సచిన్ ఎన్నోసార్లు చెప్పారు. భారత క్రికెట్‌కు ఆయన అందించిన అసమాన సేవలకు గానూ రమాకాంత్ అచ్రేకర్‌కు 1990లో ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు, 2010లో పద్మశ్రీ పురస్కారం లభించాయి. జనవరి 2019లో కన్నుమూసిన అచ్రేకర్ సేవలకు గుర్తుగా, ఆయన ఎంతోమంది దిగ్గజాలను తీర్చిదిద్దిన శివాజీ పార్క్ మైదానం నేటికీ క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.