సదర్ మాట్ బ్యారేజీ కంప్లీట్..చివరిదశలో ఎలక్ట్రిఫికేషన్, గ్రీజింగ్ వర్క్స్

సదర్ మాట్ బ్యారేజీ కంప్లీట్..చివరిదశలో ఎలక్ట్రిఫికేషన్, గ్రీజింగ్ వర్క్స్
  • టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్లకు ఇరిగేషన్ ఆఫీసర్ల సన్నాహాలు 
  • బ్యారేజీలో గోదావరి నీటి నిల్వకు ఎన్డీఎస్ఏ, సర్కార్ కు లేఖలు
  • వచ్చే యాసంగికి ఆయకట్టుకు నీటి సరఫరా చేసేందుకు ప్లాన్

నిర్మల్, వెలుగు : జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో సుమారు18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సదర్ మాట్ బ్యారేజీ పనులన్నీ పూర్తి అయ్యాయి. నిర్మల్ జిల్లా పొన్కల్ వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీ నీటిని వచ్చే యాసంగికి ఆయకట్టుకు అందించేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు.  

బ్యారేజీ ఎలక్ట్రిఫికేషన్ పనులు  మరో నెల రోజుల్లో పూర్తి కానున్నాయి. బ్యారేజీ కి అమర్చే 55 గేట్ల నిర్మాణాల పనులు పూర్తికాగా.. ప్రస్తుతం వాటికి గ్రీజింగ్ చేస్తున్నారు.  గోదావరి నీటిని బ్యారేజీలో నిల్వ చేసేందుకు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్లకు ఆఫీసర్లు  సంప్రదింపులు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్ డీఎస్ఏ), సర్కార్ కు లేఖలు రాశారు. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణానికి గోదావరి నీటి వినియోగానికి సంబంధించిన అనుమతులు ఉన్నాయి. ఇక ఎన్డీఎస్ఏ పర్మిషన్లు కూడా లాంఛనప్రాయమేనని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.  

రెండు జిల్లాలు.. 18 వేల ఎకరాల ఆయకట్టు

సదర్ మాట్ బ్యారేజీ నుంచి నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,120 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించడమే లక్ష్యం. నిర్మల్ జిల్లాలో 13,120 ఎకరాలకు,  జగిత్యాల జిల్లాలో 5 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. బ్యారేజీ రెండు జిల్లాల సరిహద్దులకు ఆనుకొని ఉండడంతో పొన్కల్ వద్ద నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకు1,170 ఎకరాలను సేకరించారు. ఇప్పటికే భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు పరిహారంగా రూ. 120 కోట్లు అందించారు. బ్యారేజీ అంచనా వ్యయం రూ. 676 కోట్లు.  కాగా.. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో సంబంధం లేకుండా ఎలక్ట్రిఫికేషన్ పనులకు మరో  రూ.14 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పనులన్నీ చివరి దశలో ఉన్నాయి.

వచ్చే యాసంగి పంటలకు సాగునీరు 

ఎన్డీఎస్ఏ పర్మిషన్లను రాగానే బ్యారేజీలో నీటి నిల్వ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారు. గోదావరి నది నీటి కేటాయింపులకు అనుగుణంగా సదర్ మాట్ బ్యారేజీ కి కూడా ఎన్డీఎస్ఏ కేటాయింపుల మేరకు  పర్మిషన్లు జారీ చేయనుంది.  దీంతో బ్యారేజీ కింద ఆయకట్టుకు వచ్చే యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఎలక్ట్రిఫికేషన్, గేట్లను కిందికి దింపే పనులు పూర్తి కాగానే  నీటిని బ్యారేజీలో నిల్వ చేస్తారు.