
- ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత
- అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తారా?: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: చట్ట ప్రకారం మంజూరు చేసిన ప్లాన్‌ను ఉల్లంఘించి ఆస్పత్రి భవనాలు నిర్మిస్తే రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను హైకోర్టు నిలదీసింది. సెట్‌బ్యాక్ వదలకుండా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి అందులో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహించడం ఏమిటని మండిపడింది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే.. ప్రమాదం జరిగితే రక్షించలేని పరిస్థితుల్లో ఉన్న ఆస్పత్రిలో డ్యూటీ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించింది.
కరీంనగర్‌లో వెంకటేశ్వర కిడ్నీ సెంటర్ ఆస్పత్రిని ప్లాన్‌కు భిన్నంగా నిర్మించిన బిల్డింగ్‌లో కొనసాగిస్తున్నారంటూ సీహెచ్ లక్ష్మీ నర్సింహారావు ఇతరులు దాఖలు చేసిన కేసులో గతంలో సింగిల్ జడ్జి.. చట్ట ప్రకారం అన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి రిట్‌ను క్లోజ్ చేశారు. అయితే అధికారులు ఆ భవన యజమానులకు, ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి వదిలేశారు.
దాంతో పిటిషనర్ అప్పీల్ దాఖలు చేయగా.. సోమవారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సెట్‌బ్యాక్ లేకుండా, ఫైర్‌సేఫ్టీ లేకుండా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందకుండా ఆస్పత్రి నిర్వహిస్తుంటే అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తారా..? చూసీచూడనట్లు వ్యవహరిస్తారా అని డివిజన్ బెంచ్ మండిపడింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశిస్తే కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుని తీరాలని, లేకుంటే ప్రతివాదులైన మున్సిపల్, ఫైర్, మెడికల్, విపత్తు నిర్వహణ శాఖల అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగితే అమాయక రోగులు బలి కావాలా..? వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? ఢిల్లీ, కోల్‌కతా తరహా భారీ అగ్ని ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని నిలదీసింది. ఇదే రీతిలో ఆస్పత్రిని కొనసాగిస్తే.. గుర్తింపును రద్దు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉత్తర్వులు ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించింది. రెండు వారాల్లోగా నిబంధనలను అమలు చేయాల్సిందేనని పేర్కొంటూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.