సాగర్​లో పోలింగ్ 86.8%.. గెలుపు తమదేనంటున్న పార్టీలు

సాగర్​లో పోలింగ్ 86.8%.. గెలుపు తమదేనంటున్న పార్టీలు
  • 2018 ఎన్నికలతో పోలిస్తే పెరిగిన పర్సంటేజీ
  • పొద్దుగల్ల నుంచే పోలింగ్​ సెంటర్ల వద్ద జనం బారులు
  • సౌలతులు అంతంతే.. వచ్చే  నెల 2న కౌంటింగ్

నల్గొండ/హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్  రాత్రి 7 గంటల వరకు సాగింది. నియోజకవర్గంలో 2,20,300 మంది ఓటర్లకు గాను సుమారు రెండు లక్షల మంది ఓటు వేశారు. సెగ్మెంట్​లోని  ఏడు మండలాల్లో కలిపి మొత్తం 86.80 శాతం పోలింగ్  నమోదైంది. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. అప్పట్లో 86.46 శాతంగా పోలింగ్​ నమోదైంది.

ఉదయం నుంచే క్యూలు
శనివారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం టైంలో ఎండ తీవ్రత పెరిగిపోవడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పలుచబడ్డారు. తిరిగి సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం మొదలుపెట్టారు. కొవిడ్ రూల్స్ ప్రకారం ఓటర్లు మాస్కు ధరించి వచ్చినప్పటికీ చాలా కేంద్రాల్లో ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించలేదు. చాలాచోట్ల ఓటర్లు భారీగా తరలిరావడంతో వాళ్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తిప్పలు పడ్డారు. కొవిడ్ రూల్స్ కారణంగా పోలింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 12.9 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతానికి చేరింది. సాయంత్రం ఐదు గంటల వరకు 81.5 శాతం, రాత్రి 7 గంటల వరకు 86.80 శాతానికి పోలింగ్​ చేరింది.

సౌలతులు అంతంతే
పోలింగ్​ కేంద్రాల వద్ద ఆఫీసర్లు సరైన నీడ, తాగునీటి వసతిని కల్పించకపోవడంతో ఎండకు వృద్ధులు, మహిళలు తల్లడిల్లారు. కరోనా నేపథ్యంలో పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తామని ప్రకటించిన ఆఫీసర్లు ఆ విషయమే మరిచిపోయారు. హాలియా పట్టణంలోని 3వ వార్డులో ఈవీఎం మొరాయించడంతో అరగంటసేపు పోలింగ్​ నిలిచిపోయింది. ఆఫీసర్లు వెంటనే సమస్యను పరిష్కరించడంతో  పోలింగ్​ సజావుగా సాగింది.  నందికొండలోని పైలాన్​ కాలనీ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో, గుర్రంపోడు మండలం వట్టికోడు,  గాసీరాం తండాలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు సుమారు గంటసేపు, మాడ్గులపల్లి మండలంలోని మాడ్గులపల్లి, కేశవాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలు సుమారు రెండు గంటల పాటు మొరాయించాయి. ఆయా చోట్ల పోలింగ్​ ఆలస్యంగా ప్రారంభమైంది. కరోనా బారినపడ్డ వాళ్లకు సాయంత్రం ఆరు గంటల తర్వాత  ఓటువేసే చాన్స్​ కల్పించారు.  త్రిపురారం మండలంలోని దుగ్గెపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు ఓటు వేసే విషయంలో అభ్యంతరం తెలపడంతో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఓటేసిన అభ్యర్థులు, ప్రముఖులు 
కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి నాగార్జునసాగర్​ హిల్​ కాలనీలో, టీఆర్​ఎస్​ అభ్యర్థి నోముల భగత్ అనుముల మండలం ఇబ్రహీంపేటలో, బీజేపీ అభ్యర్థి పానుగోతు రవినాయక్​ త్రిపురారం మండలం పలుగుతండాలో,  టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్​కుమార్​  అనుముల మండలంలోని చింతగూడెంలో ఓటు వేశారు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పెద్దవూర మండలంలోని చిన్నవూర గ్రామంలో ఓటు వేశారు.

పోలింగ్​కేంద్రాల పరిశీలన
హాలియాలోని హైస్కూల్​లో, నాగార్జునసాగర్​పైలాన్, హిల్​ కాలనీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్​ గోయల్​, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సజ్జన్​సింగ్, ఆర్​.చౌహాన్ సందర్శించి, పోలింగ్​ సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీస్​ పరిశీలకులు సునీల్​కుమార్​ మీనన్​, ఐజీలు స్టీఫెన్​ రవీంద్ర, శివశంకర్​రెడ్డి, డీఐజీ రంగనాథ్​ కమాండ్​ కంట్రోల్​ వద్ద పరిస్థితిని సమీక్షించారు. నాగార్జునసాగర్​లోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీ,  తిరుమలగిరి(సాగర్) మండలంలోని ఎర్రచెరువుతండ, నెల్లికల్​, అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో పోలింగ్​ బూత్​లను జిల్లా ఎస్పీ రంగనాథ్​ సందర్శించారు. 

ఎవరి లెక్కలు వాళ్లవే
పోలింగ్​ ముగియడంతో లీడర్లు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటి నుంచే ఓటింగ్​ సరళి ఎలా ఉందనేదానిపైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లు, లీడర్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. అభ్యర్థుల తరఫున పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లు కూడా ఓటింగ్ సరళి పైనే ఎక్కవ ఫోకస్​చేశారు. ఏ గ్రా మంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అనుకున్న వాళ్లంతా వచ్చి ఓట్లు వేస్తున్నారా? లేదా? ఏ  పార్టీకి మొగ్గు ఉంది? అనే వివరాలు సేకరించారు. 2018 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. ఈయన మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు హోరా హోరీగా తలపడ్డారు. ఏరియాల వారీగా పడిన ఓటింగ్​ శాతాన్ని తెప్పించుకొని లీడర్లు విశ్లేషించుకుంటున్నారు.  వచ్చే నెల 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

ఎటూ తేలని పోలింగ్ పర్సంటేజీ
పోలింగ్ పర్సంటేజీ ఎంత అనేది అధికారికంగా ప్రకటించలేదు. పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎం మెషిన్లను నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్ తరలించే పనిలో అధికారులు బిజీగా ఉండటంతో పోలింగ్ పర్సంటేజీ ఫైనల్ కాలేదు. అయితే రాత్రి 10. 30 గంటల వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు పోలింగ్  86.80 శాతం నమోదైనట్లుగా ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ లెక్కన గత ఎన్నికలతో పోలిస్తే 0.34 శాతం పెరిగింది. 2018 ఎన్నిక ల్లో పోలింగ్ 86.46 శాతం నమోదైంది.  

మండలాల వారీగా పోలింగ్ పర్సంటేజీ ఇలా..
మాడ్గులపల్లి     93.06
త్రిపురారం    88.70
గుర్రంపోడు    87.24
అనుమల     86.02
పెద్దవూర    77.55

పోలింగ్​ పర్సెంటేజీ ఇలా.. 
ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 12.9 శాతం 
11 గంటల వరకు 31 శాతం 
మధ్యాహ్నం 1 గంట వరకు 53.3 శాతం 
మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం 
సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం 
రాత్రి 7 వరకు 86.80 శాతం