నత్తనడకన సాగర్ ఎడమ కాల్వ పనులు

నత్తనడకన సాగర్ ఎడమ కాల్వ పనులు
  • కరెంట్ కోతలతో ఎండిపోతున్న పొలాలు
  • పనులు ఆలస్యమవుతుండడంతో ఆందోళనలో ఆయకట్టు రైతులు 

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్​ఎడమ కాల్వకు గండి పడటంతో ఆయకట్టు పరిధిలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నెల 7న నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ వద్ద సాగర్​ఎడమకాల్వ కట్ట తెగిపోవడంతో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆపేశారు. దీంతో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 6.30 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రెండు, మూడు రోజుల్లోనే కాల్వ గండి పూడ్చేస్తామని అధికారులు చెప్పారు. పది రోజులు దాటినా పనుల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. మెయిన్​ కెనాల్​ నుంచి వస్తున్న లీకేజీ వాటర్​ వల్ల పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇప్పటికైతే ఎర్రమట్టి, నల్ల మట్టితో అడుగు భాగాన్ని కంప్లీట్​ చేశారు. కానీ గండి పడ్డ ప్రదేశంలో పెద్ద ఎత్తున కాల్వ కట్ట నిర్మించాల్సి ఉంది. మరో పది రోజుల్లో ఆ పనులు కంప్లీట్​ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంతచేసినా ఇప్పటికిప్పుడు కాల్వ లైనింగ్​ పనులు మాత్రం సాధ్యం కాదని అంటున్నారు. కేవలం ఇసుక బస్తాలతోనే తాత్కాలిక పనులు చేసి నీటిని విడుదల చేస్తామని అంటున్నారు. ఎండాకాలంలో కాల్వ లైనింగ్​పనులు చేయడం సాధ్యమవుతుందని, అప్పటివరకు ఇసుక బస్తాలే శరణ్యమని చెబుతున్నారు. గండి పడటం వల్ల వచ్చిన వరదతో సుమారు రెండు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నీటి ప్రవాహం వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. పంట పొలాల నిండా రాళ్లు రప్పలు కనిపిస్తున్నాయి. తిరిగి ఆ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చేందుకు చాలా ఖర్చు అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ఆయకట్టులో అప్రకటిత కోతలు
ఎడమకాల్వకు గండి పడటంతో రైతులంతా ప్రస్తుతం బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో నల్గొండ జిల్లాలో ఐదారు రోజులుగా విద్యుత్​ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. జిల్లాకు కేటాయించిన కోటా 9.48 మిలియన్ యూనిట్లు కాగా 15.24 మిలియన్​ యూనిట్ల వాడకం జరుగుతోంది. ముఖ్యంగా సాగర్​ ఆయకట్టు ప్రాంతాలైన మిర్యాలగూడ, నాగార్జునసాగర్​ నియోజకవర్గాల్లో విద్యుత్​ కోటా 1.88 మిలియన్ యూనిట్లు కాగా, వినియోగం 4.03 మిలియన్​ యూనిట్లకు చేరింది. దీంతో అప్రకటిత కోతలు అమలు చేస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు, మళ్లీ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కరెంట్​ఇస్తున్నారని, సాయంత్రం 6 గంటల నుంచి సప్లై బంద్​ చేస్తున్నారని త్రిపురారం గ్రామానికి చెందిన అమరేందర్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతులకు పరిహారం చెల్లించాలంటూ ఆందోళన
హాలియా, వెలుగు: సాగర్​ ఎడమకాల్వకు పడిన గండి కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిడమనూరు  మండల కేంద్రంలో  రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్​ శంకర్​నాయక్​మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాల్వ గండి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. గండిని పూడ్చడంలో ఎన్నెస్పీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 24 గంటల కరెంటు సక్రమంగా రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గండిని త్వరగా పూడ్చి సాగు నీరు అందించాలన్నారు. ఆందోళన చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు కేతావత్​ శంకర్​నాయక్​తో పాటు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​కు​ తరలించారు.

సర్కారు వైఫల్యంతోనే గండి:ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి
నాగార్జునసాగర్​ ఎడమ కాల్వకు గండి పడ్డ ప్రాంతాన్ని పీసీసీ మాజీ చీఫ్​, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి శనివారం పరిశీలించారు. ఈఎన్​సీ మురళీధర్​రావు, ఆర్డీఓ, ఇతర అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నామని చెప్తున్న ప్రభుత్వం నాగార్జునసాగర్​ ఎడమకాల్వ గండిని పూడ్చడంలో అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే కాల్వకు గండి పడిందన్నారు. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో 6.3 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకో వడం లేదన్నారు. ఐదు రోజుల్లో గండిని పూడ్చుతామని చెప్పిన మంత్రి జగదీశ్​రెడ్డి ఇప్పటి వరకు పనులను పర్యవేక్షించలేదన్నారు. కొ త్తగా కరెంట్​ కష్టాలు తోడయ్యాయని, 24 గంటలు కరెంట్​సప్లై చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం 8 గంటలు మాత్రమే ఇస్తోందన్నారు. సుమారు 1500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 44 ఇళ్లు పాడయ్యాయని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

వరి ఎండిపోయే దశకు చేరింది
నాకు ఉట్లపల్లి మేజర్​ పరిధిలో 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. చింట్ల రకం వడ్లు సాగు చేసిన. నాట్లు వేసి 12 రోజులైంది. ఎడమ కాల్వకు గండి పడి నీళ్లు రావటం లేదు. బోరు కూడా లేదు. పంట ఎండిపోయే దశకు చేరింది. గండి పడి వారం దాటింది. ఇప్పటికే కలుపు పెరిగింది. ఇంకా పనులు పూర్తయ్యేం దుకు వారం అవుతదని చెబుతున్నరు. పంట చేతికి వస్తదో రాదో అని ఆందోళనగా ఉంది. 
- కొమ్ము సైదులు, ఉట్లపల్లి 

21 ఎకరాలు నీట మునిగింది
మూడో నంబర్ కాల్వ కింద 21 ఎకరాల్లో సుమారు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేశా. వరద నీటి ప్రవాహానికి పంట కొట్టుకుపోయి పొలం అంతా పూర్తిగా ఇసుక మేట వేసింది. ఇసుకను తొలగించాలంటే ఎకరాకు రూ. ఐదు లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది పంటను కోల్పోయినట్టే. తింటానికి తిండి గింజలు, పశువులకు మేత లేనట్లే. 
- అలుగుబెల్లి వెంకటరెడ్డి, నిడమనూరు