బషీర్ బాగ్, వెలుగు: సహారా ఇండియా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆల్ ఇండియా డైరెక్టర్ రావిపాటి రామకోటేశ్వరరావును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల డిపాజిట్లను సేకరించింది. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ గతంలో జైలుకు వెళ్లి , బెయిల్ పై వచ్చాక మరణించారు.
అయితే సంస్థలో డైరెక్టర్ గా ఉన్న రావిపాటి రామకోటేశ్వరరావు పై సుమారు 744 నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. గత కొన్ని నెలలుగా రామ కోటేశ్వరరావు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇటీవల న్యాయస్థానం జారీ చేసిన 15 వారెంట్ లను హైదరాబాద్ నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి సీరియస్ గా తీసుకొని , రామ కోటేశ్వరరావును వెంటనే అదుపులోకి తీసుకోవాలని సీసీఎస్ పోలీసులను ఆదేశించారు. దీంతో శనివారం కోటేశ్వరరావు ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఆయనను సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ఆదివారం న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు సైఫాబాద్ సీఐ పేర్కొన్నారు.