రివ్యూ: విరూపాక్ష

రివ్యూ:  విరూపాక్ష

క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తీసిన ఒక్కో సినిమా ఒక్కో ట్రెండ్ సెట్టర్. సుకుమార్ స్క్రీన్ ప్లే లో ఆయన శిష్యుడు కార్తీక్ దండూ డైరెక్ట్ చేసిన మూవీనే విరూపాక్ష. సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో భారీ బజ్ ని క్రియేట్ చేసింది. మరీ ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగల్గిందా లేదా చూద్దాం.

మన సంస్కృతి, సాంప్రదాయాలు, భయాలు నమ్మకాలు, మూడ నమ్మకాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ సినిమానే విరూపాక్ష.రుద్రవరం అనే ఓ మారుమూల పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది సినిమా స్టోరీ. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఓ ఫ్యామిలీ... చేతబడి చేసి తమ పిల్లల్ని పంపేస్తున్నారని ఆ జంటని అందరిముందు మంటల్లో కాల్చేస్తారు. అయితే మంటల్లో కాలి చనిపోతున్న ఆ జంట ఊరికి ఒక శాపం పెడ్తారు. ఇక కొన్నేళ్ల తర్వాత ఊర్లో జాతర జరగే టైమ్ లో... గర్భగుడిలో ఒకరు చనిపోతారు. దీంతో ఆ ఊరి పెద్ద చెప్పినట్లుగా ఆ ఊరి ప్రజలు తమ గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. అయినా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉంటారు. ఆ చాపులకి కారణాలేంటి? ఆ ఊరికి హీరో సూర్యకి సంబంధం ఏంటి? ఈ ఊరి ప్రజలని సూర్య ఎలా కాపాడాడన్నది తెరపై చూడాల్సిందే. 

ఈ సినిమాకి ప్రాణం కథే. రాసుకున్నది రాసుకున్నట్లుగా తెరపై చూపించిన డైరెక్టర్ కార్తీక్ దండూకి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. సినిమాలో ఎక్కడా బోర్ కొట్టకుండా బాగా ఎగ్జ్యూట్ చేశాడు. ఈ సినిమాలో వచ్చే ప్రతీ ట్విస్ట్ కి, అజ్నీష్ లోక్నాథ్ అందించిన బీజీఎం కి ఫిదా అవ్వాల్సిందే. ఒక్కోసారి వచ్చే ఒళ్లుగగ్గుర్లు పొడిచే సన్నివేశాలు.. ప్రేక్షకుల్ని కుర్చీలోనుంచి లేవనీయవు. భయపడ్తూ కూడా ఏం జరుగుతుందనే ఆతృత ప్రతీ ప్రేక్షకుడికి ఉంటుంది. ఇక శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో హైలెట్.  

 ఇక సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. గాయాలు ఇంకా బాధపెడ్తున్నా...  సూర్య క్యారెక్టర్ లో తేజ్ తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు తేజ్.  సంయుక్తా మీనన్ నందినీ క్యారెక్టర్ లో బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ హాఫ్ లో ఆమెకు స్క్రీన్ టైం తక్కువే ఉన్నా... సెకండ్ హాఫ్ లో ఆమె పాత్రే కీలకం. అయితే తేజ్ తో సంయుక్త కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్క్ అవుట్ అవ్వలేదన చెప్పొచ్చు. అభినవ్ గోమాటం, సాయి చంద్, సునీల్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చే ట్విస్ట్ లు ఈ సినిమాకి మేజర్ హైలెట్. సెకండాఫ్ స్టార్ట్ అయినప్పటీ నుంచి ఈ సినిమాలో విలన్ ఎవరు అనే ప్రశ్న ప్రేక్షకుడి మదిలో మెదులుతూనే ఉంటుంది. వాళ్లని అదే క్యూరియాసిటీతో చివరి వరకు కుర్చీలోనే కూర్చొబెట్టాడు డైరెక్టర్. స్క్రీన్ ప్లే తో పాటు బీజీఎం ని ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమాని థియేటర్ లో చూడాల్సిందే. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే... ప్రేక్షకులకు మంచి మెసేజ్ ని అందించే థ్రిల్లింగ్ మూవీ ఇది.