ఖైరతాబాద్, వెలుగు: తమ ప్లాట్లను 118 జీఓ కింద రెగ్యులరైజ్ చేయకపోతే చావే దిక్కు అని పీర్జాదిగూడ మున్సిపాలిటీ పర్వాతాపూర్ గ్రామంలోని సాయి ప్రియనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాలనీ అసోసియేషన్ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మెడకు ఉరి తాళ్లు వేసుకుని నిరసన తెలిపారు.
ప్లాట్లు రెగ్యులరైజ్ చేయకపోతే, ఉరి వేసి చంపేయండన్నారు. చీఫ్ అడ్వయిజర్ నారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్హయాంలో ప్లాట్లను రెగ్యులరైజ్ చేయకుండా ఆ పార్టీ లీడర్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్నేతలు వారిని మించిపోతున్నారన్నారు. ఇప్పటికే కాలనీలోని 200 ఇండ్లను నేలమట్టం చేశారని, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
పైసా పైసా కూడబెట్టుకొని 1994 నుంచి 2002 వరకు 350 మంది వాయిదాల పద్ధతిలో ప్లాట్లు కొన్నామని, ఎల్ఆర్ఎస్ కూడా ఉందని చెప్పారు. కొన్ని ప్లాట్లకు మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయితీ పర్మిషన్లు ఉన్నాయని, కరెంటు బిల్లు, ఇండ్లకు హౌజ్ నంబర్లు ఉన్నాయని తెలిపారు. జీఓ118 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో మహేందర్, సుజాత, లక్ష్మి, సంజీవరావు, ఊర్మిల, ఆర్.ప్రసాద్తదితరులు పాల్గొన్నారు.
