
పని చేస్తున్న సంస్థకే స్నేహితుడితో కలిసి కన్నం వేశాడు ఓ వ్యక్తి.క్రికెట్ బెట్టింగ్ లాస్ అయి పనిచేస్తున్న సంస్థలోనే దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఏకంగా కోటిన్నర బంగారం, డైమండ్ ఆభరణాలు స్నేహితుడితో కలిసి మాయం చేశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఇటీవల హైదరాబాద్ లో వ్యాపారి నుంచి కోట్లు విలువజేసే బంగారం, డైమండ్స్ చోరీ కేసులో నిందితులను గురువారం(సెప్టెంబర్11) అరెస్ట్ చేశారు సైఫాబాద్ , సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోటిన్నర విలువైన డైమండ్స్ , బంగారం ఆభరణాలను, 4 సెల్ ఫోన్లను స్వాధీనంచేసుకున్నారు. బషీర్ బాగ్ లోని సెంట్రల్ జోన్ ఆఫీసులో దొంగతనం జరిగిన వివరాలను డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.
మహారాష్ట్ర ముంబై కు చెందిన బంగారం వ్యాపారి విపుల్ షా తరుచు, హైదరాబాద్ కు డైమండ్స్ , గోల్డ్ అర్నమెంట్స్ కొరియర్ లో పంపించేవాడు. అతని ఎగ్జిక్యూటివ్స్ వాటిని తీసుకొని హైదరాబాద్ లో పలు బంగారు ఆభరణాల షాప్స్ కు తిరుగుతూ వాటిని అమ్మడం, ఆర్డర్స్ తీసుకుకోవడం చేసేవారు.
ఇటీవల ముంబై నుంచి విపుల్ పార్సల్ ను పంపించారు. వాటిని మార్కెటింగ్ చేయడానికి చడవ రోనక్ (24) ఎగ్జిక్యూటివ్ ముంబై నుండి నగరానికి వచ్చాడు. మార్కెటింగ్ చేసిన తరువాత డైమండ్స్, గోల్డ్ అర్నమెంట్స్ ను బషీర్ బాగ్ లోని విజయ శంకర్ లాల్ జ్యూవెలర్స్ లో భద్రపరిచారు. మరుసటి రోజు బ్యాగ్ చూడగా అందులో ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆ షాప్ యజమాని ముంబై లోని విపుల్ కు సమాచారం ఇచ్చాడు. ముంబై నుంచి వచ్చిన విపుల్ కోటిన్నర విలువ చేసే డైమండ్స్ , గోల్డ్ అర్నమెంట్స్ కనిపించడం లేదని... సెప్టెంబర్ 7న సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీఎస్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు.
ఎగ్జిక్యూటివ్ తీరుపై అనుమానం రావడంతో..
ఆభరణాలున్న బ్యాగ్ పోయిందని వ్యాపారి విపుల్ పోలీసులకు ఫిర్యాదు చేయగానే ఎగ్జిక్యూటివ్ రోనక్ తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ముంబైకి వెళ్తున్నానని వెళ్లాడు. దీంతో రోనక్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతని కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. గురువారం చడవ రోనక్ అతని స్నేహితుడు మహ్మద్ హాసనన్(22) తో కలిసి నగలున్న బ్యాగ్ తో పారి పోతుండగా పట్టుకున్నారు. విచారణలో తామే బంగారం, డైమండ్స్ దొంగిలించామని నిందితులు ఒప్పుకున్నారు.
ఐపీఎస్ బెట్టింగ్ లో లాస్..చోరీకి ప్లాన్ ఇలా..
ముంబై కు చెందిన చడవ రోనక్ మహమ్మద్ హాసనైన్ లు స్నేహితులు. ఇటీవల ఐపీఎల్ బెట్టింగ్ లో ఇద్దరు డబ్బులు పోగొట్టుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చడవ రోనక్ ఈ ఏడాది ఏప్రిల్ లో విపుల్ దగ్గర ఎగ్జిక్యూటివ్ గా పనిలో చేరాడు. తరుచు హైదరాబాద్ కు విలువైన డైమండ్స్ , గోల్డ్ అర్నమెంట్స్ తీసుకెళ్లి వస్తుండటంతో వాటిని చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. సెప్టెంబర్ 3న తనతో పాటు అతని స్నేహితుడు మహమ్మద్ హాసనైన్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. అర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ ను అతని స్నేహితుడికి ఇచ్చి, ఖాళీ బ్యాగ్ ను బషీర్ బాగ్ లోని జ్యూవెలర్స్ షాప్ లో ఉంచాడు. ఎవరికి అనుమానం రాకుండా అక్కడి ఎంప్లాయిస్ తోనే ఉన్నాడు.
ఖైరతాబాద్ రైల్వే బ్రిడ్జ్ కింద డైమండ్స్ బ్యాగ్
డైమండ్స్ ఉన్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లిన మహ్మద్ హాసనన్ ఎవరికి అనుమానం రాకుండా ఖైరతాబాద్ రైల్వే బ్రిడ్జ్ కింద నిర్మానుష ప్రాంతంలో బండ రాళ్ళ కింద దాచిపెట్టాడు. రెండు రోజుల తరువాత బ్యాగ్ ను తీసుకొని నగరంలో ఓ హోటల్ లో ఇద్దరు బస చేశారు. గురువారం ముంబై కు వెళ్లేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి దగ్గర నుంచి కోటిన్నర విలువ చేసే 173 పీసెస్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు.